వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.ఇదే నెలలో జగన్ రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం గమనార్హం. ఢిల్లీ పర్యటనకు వెళ్లేముందు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే, గతంలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత జగన్.. ఆ వివరాలను వెల్లడించకపోవడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం మరోసారి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పర్యటన వివరాలను మీడియా ముందుకు వచ్చి చెప్పేంత ధైర్యం జగన్‌కు లేదని దేవినేని విమర్శించారు. ఇక ఎన్నికల ముందు కేంద్ర మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.