గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆయన చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. వల్లభనేని వంశీ బీజేపీని సంప్రదించి తన సాధకబాధకాలు చెప్పుకున్నారని వెల్లడించారు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీజేపీ నాయకత్వంతో చెప్పుకున్నారని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేనని సుజనా స్పష్టం చేశారు. సత్తా ఉన్న నేతలు బీజేపీలోకి రావొచ్చని, అలాంటివారికి తాము ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. కాగా, తన రాజీనామా ప్రకటించకముందు వంశీ బీజేపీ నేత సుజనాతో ఒకే కారులో ప్రయాణించడం పలు సందేహాలకు తావిచ్చింది. వంశీ బీజేపీలో చేరతారని భావించినా ఆయన వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది.