ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకునేందుకు గానూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రాల్లో తీసుకుంటోన్న చర్యల గురించి ముఖ్యమంత్రులను అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే శాంతి, భద్రతలను కొనసాగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. అమిత్ షా ఈ రోజు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు.