Skip to main content

Posts

Showing posts from November 24, 2019

అజిత్ పవార్ తాజా ట్వీట్ తో అంతా అయోమయం!

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కారకుడైన అజిత్ పవార్ తాజాగా చేసిన ట్వీట్ అయోమయం సృష్టిస్తోంది. తాను ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, ఎల్లప్పటికీ తమ నాయకుడు శరద్ పవారేనంటూ అజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేకాదు, మహారాష్ట్రలో వచ్చే ఐదేళ్లపాటు తమ బీజేపీ-ఎన్సీపీ కూటమి ప్రజారంజక పాలన సాగిస్తుంటూ పేర్కొన్నారు. అంతకుముందు, శరద్ పవార్ వ్యాఖ్యానిస్తూ అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతమని, ఆయన నిర్ణయంతో పార్టీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. అజిత్ నిర్ణయాన్ని ఎన్సీపీ స్వాగతించడంలేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తాజా ట్వీట్ పై ఇతర రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.

ఓ బాలుడి కోసం 2100 స్పోర్ట్స్ కార్లు, 70 బైకులు తరలివచ్చాయి... అసలు కారణం ఇదే!

అమెరికాలోని మిస్సౌరీలో ఒక్కసారిగా వేల సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు వరుసగా కొలువుదీరాయి. దీనంతటికీ కారణం తెలుసుకోవాలంటే అలెక్ ఇంగ్రామ్ అనే 14 ఏళ్ల బాలుడి కథ తెలుసుకోవాలి. అలెక్ ఇంగ్రామ్ నవంబరు 7న కన్నుమూశాడు. ఆస్టియోసర్కోమా అనే అరుదైన బోన్ క్యాన్సర్ అలెక్ ను కబళించింది. నాలుగేళ్లకు పైగా క్యాన్సర్ తో పోరాడిన ఆ మిస్సౌరీ బాలుడు కొన్నిరోజుల క్రితమే ఈ లోకాన్ని వీడాడు. అలెక్ కు స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి. అందుకే తన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు, బైకులు పాల్గొనాలన్నది చివరికోరిక అని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలిసిన అమెరికా సమాజం కదిలిపోయింది. ముఖ్యంగా సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ ముందుకొచ్చి స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓ కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కార్లు వాషింగ్టన్ లోని మిస్సౌరీ చేరుకున్నాయి. మిస్సౌరీ నుంచి వాషింగ్టన్ లోని ఇమ్యూనల్ లూథరన్ చర్చ్ వరకు అలెక్ కడసారి యాత్రకు తోడుగా వచ్చేందుకు స్థానిక సిక్స్ ఫ్లాగ్స్...

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

నేడు సీఎం రమేశ్ కుమారుడి నిశ్చితార్థం.. అతిథుల రాక కోసం 15 విమానాలు

దుబాయ్‌లో ఈ రోజు బీజేపీ నేత సీఎం రమేశ్ కుమారుడి నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకకు పలువురు ఎంపీలు, టీడీపీ నేతలు దుబాయ్‌ వెళ్లనున్నారు. వారి ప్రయాణం నిమిత్తం 15 విమానాలు ఏర్పాటు చేశారు. నిశ్చితార్థానికి పలువురు వైసీపీ ఎంపీలకు కూడా ఆహ్వానాలు అందాయి. దుబాయ్‌లో ఈ వేడుక అంగరంగ వైభంగా జరుగుతుంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆలూరి రాజా కుమార్తె పూజతో సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ కు నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారని తెలిసింది. ఆలూరి రాజా కుటుంబ సభ్యులు అందరూ వైద్యులే. అమెరికాలో వీరి కుటుంబం ఉంటోంది.   

లోక్‌సభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్, వైసీపీ ఎంపీల నియామకం

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్‌ రెడ్డి, రఘురామ కృష్ణంరాజులు లోక్‌సభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్‌‌రాం మేఘవాల్‌, వి.మురళీధరన్‌‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ నామా, వైసీపీ ఎంపీలను కమిటీ సభ్యులుగా నియమించినట్టు శనివారం లోక్‌సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది.

అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ బోర్డు శుభవార్త!

అయ్యప్ప మాలధారులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. కార్లు, 12 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న వాహనాలను పంపానది బేస్ క్యాంపు వరకు అనుమతించాలని నిర్ణయించింది. గతేడాది సంభవించిన వరదల కారణంగా పంపానది బేస్ క్యాంపు దెబ్బతినడంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత నీలక్కల్ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. టీడీబీ తాజా నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల పూజల కోసం గత శనివారం అయ్యప్ప ఆలయం తెరుకుంది. వారం రోజుల్లోనే ఏకంగా 3.5 లక్షల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మున్ముందు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో కార్లను పంపానది బ్యాస్ క్యాంపు వరకు అనుమతించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.