Skip to main content

దేవీపట్నం చేరుకున్న స్కూబా డైవర్లు... బోటు మునిగిన కచ్చులూరు వద్దకు ప్రయాణం

 


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంకు విశాఖ నుంచి స్కూబా డైవర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన ‘రాయల్‌ వశిష్ట’ బోటు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో, దాన్ని వెలికి తీయాలంటే స్కూబా డైవర్ల అవసరం ఉందని రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం అధికారులకు తెలియజేసిన విషయం తెలిసిందే. సత్యం సూచన మేరకు అధికారులు విశాఖలోని డైవర్లతో మాట్లాడారు. వారు ఈరోజు ఉదయం దేవీపట్నం చేరుకున్నారు. అయితే డైవర్లను కచ్చులూరు పంపే విషయంలో ధర్మాడి సత్యం, పోలీసుల మధ్య వివాదం నెలకొంది. ఉన్నతాధికారుల అనుమతి లేదంటూ పోలీసులు డైవర్లను ఘటనా స్థలి అయిన కచ్చులూరుకు పంపేందుకు నిరాకరించారు.

అధికారుల అనుమతితోనే డైవర్లను రప్పిస్తే, మళ్లీ ఇదేం తిరకాసని సత్యం పోలీసులతో వాదనకు దిగాడు. పని ముందుకు వెళ్లాలంటే తక్షణం డైవర్లు కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఇరువర్గాల మధ్య వాదనతో వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ జోక్యం చేసుకుని డైవర్లను ఘటనా స్థలికి పంపించేందుకు అనుమతించి, బోటు ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయింది.

కాగా, నాలుగు రోజులుగా సత్యం బృందం బోటు వెలికితీసేందుకు  చేస్తున్న ప్రయత్నాలు అందినట్టే అంది చేజారుతున్నాయి. దీంతో డైవర్లను నేరుగా బోటు వద్దకు పంపి సరైన ప్రదేశంలో బోటుకు లంగర్లు తగిలిస్తే వెలికితీత సులువవుతుందన్నది సత్యం బృందం ఉద్దేశం. ఇప్పుడు డైవర్లు కూడా వచ్చినందున వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.