గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీలేదని చెప్పారు. అయితే, ఆయన కోలుకుంటున్నారన్న ఆశతోనే ఉన్నామని, అభిమానులు, సినీ పరిశ్రమ ప్రార్థనలే తమకు బలాన్నిస్తున్నాయని అన్నారు. తన తండ్రి కోసం సామూహిక ప్రార్థన చేసిన సినీ, సంగీత వర్గాలకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. అయితే, ఓ దశలో ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు కొన్నిరోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది.