Skip to main content

Posts

Showing posts from October 3, 2019

ఆంధ్రా బ్యాంకు పేరు పోవడం బాధగా ఉంది: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు బ్యాంకుల విలీనం అంశంపై స్పందించారు. విలీనం కారణంగా ఆంధ్రా బ్యాంకు పేరు పోవడం బాధగా ఉందని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారని హరీశ్ తెలిపారు. ఆంధ్రా బ్యాంకు పేరు కొనసాగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం అని స్పష్టం చేశారు. ఎక్కువ ఖాతాలు ఉన్న బ్యాంక్ ఆంధ్రా బ్యాంకు అని, ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లతో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ బ్రాంచ్ ను ప్రారంభించిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు

ఈయన విజయసాయిరెడ్డి... ట్వీట్లతో రెచ్చగొడతాడు: చంద్రబాబు

వైసీపీ సోషల్ మీడియాలో తమపై భరించలేనంతగా అసత్య ప్రచారం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాత్రికేయులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై ఎలా ప్రచారం చేస్తున్నారో చూడండి అంటూ మచ్చుకు కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించారు. ఈ క్రమంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను కూడా ఏకరవు పెట్టారు. ఈయన... విజయసాయిరెడ్డి... కోడెలపై వచ్చిన ఫర్నిచర్ ఆరోపణలతో వరుసగా ట్వీట్లు చేసి రెచ్చగొట్టాడని ఆరోపించారు. సహించలేనంత పదజాలంతో ట్వీట్లు చేసి చివరికి కోడెల ఆత్మహత్యకు కారకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష రూపాయల ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోడెల లేఖ కూడా రాశారని, అయినా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. కానీ, రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ మిమ్మల్నేం చేయాలంటూ నిప్పులు చెరిగారు.

హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదు: వెంకయ్యనాయుడు

ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హిందీ నేర్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు అనేక రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ఆమోదయోగ్యం కాదంటూ అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అన్ని భాషలకు సరైన గౌరవం కల్పించాలని అన్నారు. హిందీ ప్రచారంలో తెలుగు సాహిత్యం పాత్ర కీలకం అని అభిప్రాయపడ్డారు. జాతీయ భాష ప్రచారానికి హైదరాబాద్ ముఖద్వారం వంటిదని పేర్కొన్నారు.

ఆ అవకాశమే ఉంటే ఒక్కరోజులో బోటును బయటికి తీస్తా: ధర్మాడి సత్యం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మునిగిపోయిన బోటును వెలికితీస్తే ఆచూకీ తెలియని వారి మృతదేహాలు కూడా బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బోటు వెలికితీత పనులను కాకినాడ బాలాజీ మెరైన్స్ సంస్థకు అప్పగించింది. అయితే, మూడ్రోజులు తీవ్రంగా ప్రయత్నించినా బోటు ఆచూకీ లభ్యం కాలేదు. నాలుగోరోజు ప్రతికూల వాతావరణం కారణంగా పనులు నిలిచిపోయాయి. దీనిపై బాలాజీ మెరైన్స్ అధినేత ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడారు. బోటు మునిగిపోయిన ప్రాంతంలో గతంలో కంటే ఇప్పుడు సుడిగుండాలు తీవ్రంగా ఉన్నాయని, తాము ప్రయాణిస్తున్న బోటు యజమాని భయపడుతున్నాడని, అందుకే వెలికితీత పనులు నిలిపివేశామని చెప్పారు. భారీ వర్షం పడడంతో గోదావరి ఉద్ధృతి మరింత పెరిగిందని, దాంతో సుడిగుండాలు తీవ్రత మరింత ఎక్కువైందని వివరించారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వెలికితీత కష్టసాధ్యమని ధర్మాడి సత్యం తెలిపారు. అయితే, ఎన్డీఆర్ఎఫ్ దళాల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నదిలోకి వెళ్లి బోటుకు నేరుగా లంగరు తగిలించే వీలుంటుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆ...

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

అధికారులూ జాగ్రత్త!... శాంతిభద్రతల కోసం గతంలో మా పార్టీ వాళ్లనే జైలుకు పంపా: చంద్రబాబు హెచ్చరిక

ఏపీ విపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్ర పోలీసులకు, అధికారులకు విస్పష్టమైన హెచ్చరికలు చేశారు. పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గమనించాలని హితవు పలికారు. గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లారని, అధికారులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. శాంతిభద్రతల కోసం గతంలో తమ పార్టీ నేతలనే జైలుకు పంపానని చంద్రబాబు వెల్లడించారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలని హితవు పలికారు.

ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుందామనుకున్న రైల్వే... సూపర్ ప్లాన్ వేసిన జనాలు!

దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచడం తెలిసిందే. రూ.10 టికెట్ ను ఏకంగా రూ.30కి పెంచేశారు. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఉత్తి పుణ్యానికి రూ.30 చెల్లించాల్సి రావడం ఎందుకనుకున్న ప్రజానీకం అదిరిపోయే ప్లాన్ తో రైల్వే శాఖకు షాకిచ్చింది. రైల్వే స్టేషన్ కు వెళ్లే క్రమంలో ప్లాట్ ఫామ్ టికెట్ కు బదులు పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం మొదలుపెట్టారు. పాసింజర్ ట్రైన్ మినిమమ్ చార్జి రూ.10 కాగా, పది రూపాయలు పెట్టి పాసింజర్ టికెట్ కొని దర్జాగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నారు. ఈ విధంగా రూ.20 ఆదా చేస్తున్నారు. అంతేకాదు, స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ వద్ద ఉన్న పాసింజర్ టికెట్ ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు. ప్లాట్ ఫామ్ టికెట్ల కన్నా పాసింజర్ టికెట్ల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించడంతో అధికారులు ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. ఏదేమైనా రైల్వే అధికారులు ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచేటప్పుడు ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారనే చెప్పాలి.

గాంధీ జయంతి రోజున మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలి: విడదల రజని

సీఎం జగన్ వైఖరిని విశ్లేషించడం ఎవరి వల్ల కావడంలేదని, గాంధీ జయంతి రోజున కూడా మద్యం అమ్మడం ఏంటో అర్థంకావడంలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని స్పందించారు. గాంధీ జయంతి రోజు మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మద్యనిషేధం దిశగా కృషి చేస్తోందని విడదల రజని స్పష్టం చేశారు.

వాళ్ల సోకులకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు: గత ప్రభుత్వంపై బొత్స విసుర్లు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఏ ఫంక్షన్ నిర్వహించినా ప్రకటనలకు, స్నోలు, పౌడర్లు, సోకులకు కోట్ల రూపాయలు దుబారా చేశారని ఆరోపించారు. తాను చేపట్టిన పురపాలక శాఖ విషయానికొస్తే, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.15 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. భారీగా బకాయిలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. ఇక, రహదారులపై ఉండే అనాథల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయాలని లేఖలో కోరారు. ఉపాధి హామీ పథకాన్ని 2014-19 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు. రూ. 1,845 కోట్ల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా... దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇంకా జోడించలేదని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం నియమనిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని, నిధులను దారి మళ్లిస్తోందని తెలిపారు.

నిజమే.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయి: బొత్స

ఏపీలో విద్యుత్ కోతలు ఉన్న మాట నిజమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ కొరత గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వచ్చినప్పుడు... ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కొరత తగ్గిందని చెప్పారు. ఆసుపత్రుల వద్ద క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

వైఎస్ జగన్ గారూ, చేతకాని వాళ్లకు నోరు ఎక్కువంటారు... వీళ్లను చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం: లోకేశ్ విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ మీడియా చానల్ లో గ్రామ సచివాలయాల ఏర్పాటుపై చర్చ సందర్భంగా వైసీపీ నాయకుడు రెచ్చిపోయి మాట్లాడుతున్న వీడియోను లోకేశ్ తన ట్వీట్ లో ఉదహరించారు. "వైఎస్ జగన్ గారూ, చేతకానివాళ్లకు నోరు ఎక్కువంటారు. మీ తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో అర్థంకాక, మీ పార్టీ అధికార ప్రతినిధులు కిందామీదా పడుతున్నారు. టీవీలో తమను ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ల మాటలకు గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

చంద్రబాబు ఖాళీ పాత్ర ఇచ్చారు.. వైసీపీది అక్షయపాత్ర: మంత్రి నారాయణస్వామి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ఖాళీ పాత్ర ఇచ్చి పోయారని మంత్రి నారాయణస్వామి అన్నారు. అయితే, వైసీపీ అక్షయపాత్ర కావడంతో అన్ని పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంటూ చంద్రబాబు అవాస్తవాలను మాట్లాడుతున్నారని, నిన్న మద్యం ఏరులై పారిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను చంద్రబాబు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. టీడీపీ పాలనలో పోలీస్ శాఖ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కానీ వైసీపీ పాలనలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు.

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్ర‌యించిన చిదంబ‌రం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ‌ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. చిదంబ‌రం త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ కోర్టులో వాదించ‌నున్నారు. జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ బెంచ్ ఈ కేసును త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆయ‌న పిటిష‌న్‌లో కోరారు. ఇదే బెంచ్‌లో జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, కృష్ణ మురారీలు ఉన్నారు. అయితే చిదంబ‌రం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను చీఫ్ జ‌స్టిస్‌కు పంప‌నున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచార‌ణను ఎదుర్కొంటున్న చిదంబ‌రం ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. దీంతో చిదంబ‌రం సుప్రీంను ఆశ్ర‌యించారు.

మళ్లీ పోటెత్తిన గోదావరి...జల దిగ్బంధంలో తొమ్మిది గ్రామాలు

గోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఎగువన నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద పెరిగినప్పుడల్లా తరచూ తమకీ సమస్య తప్పడం లేదని, వరదలో చిక్కుకున్నన్నాళ్లు ఇబ్బందులేనని గ్రామస్థులు వాపోతున్నారు.

యూఎస్ లో దుమ్మురేపేస్తోన్న 'సైరా'

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సైరా నరసింహా రెడ్డి' ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. యూఎస్ లో ఇప్పటికే ఈ సినిమా 1 మిలియన్ వసూళ్లను రాబట్టేసింది. అక్కడ కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. దాంతో వారాంతపు సెలవుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. బలమైన కథాకథనాలు .. భారీ బడ్జెట్ .. వివిధ భాషల్లో క్రేజ్ వున్న ఆర్టిస్టులు ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమని చెప్పుకుంటున్నారు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ కి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.