Skip to main content

Posts

Showing posts from November 2, 2019

ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారం ఐపీఎస్ సురేంద్రబాబుకు అప్పగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం

  ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు వెలువరించింది. ఎస్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన ఐపీఎస్ అధికారి ఎన్ వి సురేంద్రబాబు ఇసుక, అక్రమ తవ్వకాలు, ఎక్సైజ్ వ్యవహారాలు కూడా చూడనున్నారు. జే ఎస్ వి ప్రసాద్ సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు అందుకోగా, గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇంఛార్జీగా కె కన్నబాబు నియమితులయ్యారు. వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈయన విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించనున్నారు.  మరో ఐపీఎస్ అధికారి త్రిపాఠిని డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.

జనసేనకు రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలరాజు

  జనసేన పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. బాలరాజు ఎన్నికలకు కొద్దిరోజుల ముందే జనసేనలో చేరారు. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. తన రాజీనామాకు దారితీసిన కారణాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రూపంలో తెలియజేశారు. కొన్ని నిర్ణయాలు ఎంతో వేదన కలిగించినా, రాజీనామా చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు. రేపు విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న తరుణంలో అదే ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత రాజీనామా చేయడం పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి.  

2430 జీవో వివాదాన్ని సుమోటోగా స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా... వైసీపీ సర్కారుకు నోటీసులు

ఏపీలో మీడియాను కట్టడి చేసే విధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 2430 అమలుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా సంస్థలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దుర్మార్గపు జీవో అని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. తాజాగా, జీవో 2430 వివాదాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. జీవోపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ ముఖ్య కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. ఈ జీవో పాత్రికేయుల విధి నిర్వహణకు, మీడియా స్వేచ్ఛకు పెనుభారంగా ఉందని అభిప్రాయపడింది.

జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల అధికారిక మ్యాప్ ఇదిగో! Bun

    జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని ఎన్డీయే ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఓ భాగం జమ్మూకశ్మీర్ అనే పేరుతో, మరో భాగం లడఖ్ పేరుతో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. అక్టోబరు 31 నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. తాజాగా, ఈ ప్రాంతాల భౌగోళిక చిత్రపటాలు విడుదల అయ్యాయి.

రజనీకాంత్ కు విశిష్ట పురస్కారం... ప్రకాశ్ జవదేకర్ ప్రకటన

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్ఫి)లో ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయం తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగానికి రజనీకాంత్ అందించిన సేవలు అద్భుతమని జవదేకర్ ఓ ప్రకటనలో కొనియాడారు. అందుకే ఈ ఏడాది ఇఫ్ఫి-2019 ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును రజనీకాంత్ కు ప్రదానం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 50వ ఇఫ్ఫి అవార్డుల ఉత్సవం గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన సుమారు 250 సినిమాలను ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఇక, విదేశీ ఆర్టిస్ట్ కేటగిరీలో  ఇఫ్ఫి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఈ ఏడాది ఫ్రెంచ్ నటీమణి ఇసబెల్లా హూపర్ట్ కు ప్రదానం చేస్తున్నట్టు జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా, ఇఫ్ఫి-2019 చలనచిత్రోత్సవాలను భారత్ తన చిరకాల మిత్రదేశం రష్యా భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.  

పవన్ కల్యాణ్ 'లాంగ్ మార్చ్' పై మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు

రాష్ట్రంలో ఇసుక కొరత అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించ తలపెట్టిన 'లాంగ్ మార్చ్' కార్యక్రమంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ నిర్వహిస్తోంది 'లాంగ్ మార్చ్' కాదని 'రాంగ్ మార్చ్' అని సెటైర్ వేశారు. చంద్రబాబు పిలుపు ఇవ్వగానే జనసేన ఆందోళనకు దిగడం ఏంటన్న అనిల్ కుమార్, జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ పార్టీగా నడుస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఇదే తంతు అని విమర్శించారు. ఏర్పేడు ఘటన బాధితులను పవన్ ఎందుకు పరామర్శించలేదో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖలో రేపు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో భారీగా భవన నిర్మాణ రంగ కార్మికులతో జనసేన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ 'లాంగ్ మార్చ్' కు తాజాగా ఏపీ పోలీసుల నుంచి అనుమతి కూడా మంజూరైంది.  

ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి: ఏపీ మంత్రి కన్నబాబు

  ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై ప్రతి పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వరద ఉద్ధృతి వల్ల కొంతవరకు ఇసుక కొరత ఏర్పడిందని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గుంటూరు జిల్లా, తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటూ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.  మొన్న లోకేశ్ దీక్ష చేయగా, రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తూ, రాజకీయ లబ్ధికోసమే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కు కూడా వారి ఇబ్బందులు కనిపించలేదా? అని ప్రశ్నించారు.  

జగన్ పై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.. ఆయన నేరస్తుడు కాదు: సి.రామచంద్రయ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక నేరస్తుడు కాదని వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని... అనేక కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే బాధ కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేయాలనుకుంటున్న కార్యక్రమాలను జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తిన వేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని చిల్లర పార్టీలు మాత్రమే చంద్రబాబుకు మద్దతిస్తున్నాయని అన్నారు.