Skip to main content

Posts

Showing posts from November 10, 2019

మా వల్ల కాదు... మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో చేతులెత్తేసిన బీజేపీ

 మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించినా, తమ వల్ల కాదంటూ బీజేపీ అశక్తత వ్యక్తం చేసింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ తమకు లేదని, ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన కూడా సహకరించడంలేదని బీజేపీ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీకి తెలియజేసింది. అంతకుముందు, గవర్నర్ ఆహ్వానంపై దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సమావేశమై చర్చించారు. అనంతరం తమకు సంఖ్యాబలం లోపించినందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నామని పాటిల్ ప్రకటించారు.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కి సొంతగడ్డపై ఘనస్వాగతం

  భారతదేశ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సమస్యగా వినుతికెక్కిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమతీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా ఆయన తన స్వరాష్ట్రం అసోం వెళ్లగా అక్కడ అపూర్వరీతిలో స్వాగతం లభించింది. గువాహటి విమానాశ్రయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఓ రాజకీయనాయకుడి తరహాలో ఆయనకు స్వాగతం పలికారు. రంజన్ గొగోయ్ 'కోర్ట్స్ ఆఫ్ ఇండియా 'అనే పుస్తకం అసోం వెర్షన్ ను ఆవిష్కరించేందుకు గువాహటి చేరుకున్నారు. ఆయన విమానం దిగీదిగగానే శాలువాలతో సత్కరించేందుకు పోటీలు పడ్డారు.  

మాతృభాషను ఎలా కాపాడుకోవాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి: వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హితవు

ఏపీలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న వైసీపీ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందని నిలదీశారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ వైసీపీ సర్కారుకు హితవు పలికారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ పరిరక్షించుకుంటున్న వైనం వైసీపీ నాయకత్వానికి ఓ పాఠం వంటిదని తెలిపారు. మాతృభాష మనుగడ కోసం 2017 తెలుగు మహాసభల్లో 'తొలి పొద్దు' పేరుతో 442 మంది కవులు రాసిన రచనలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.  

కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తాననడం సరికాదు: అశ్వత్థామరెడ్డి

  తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజు కొనసాగుతోంది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సమంజసం కాదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. నిన్న చలో ట్యాంక్‌బండ్‌ నిరసన కార్యక్రమానికి ఒక గంట పాటు అనుమతి ఇస్తే అంతటి గందరగోళం చెలరేగేది కాదని చెప్పారు. ఈ రోజు విద్యానగర్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిలపక్ష భేటీ జరిగింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగుతారని చెప్పారు. కార్మికులపై జరుగుతోన్న దమనకాండకు నిరసనగా ఈ నెల 18న సడక్‌ బంద్‌ నిర్వహిస్తామన్నారు. కార్మికులపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలను ఎగ్జిబిషన్‌ పెట్టి ప్రదర్శిస్తామని వివరించారు.

హీరోగా గల్లా అశోక్‌.. సినిమా ఆరంభం క్లాప్‌ కొట్టిన రామ్‌ చరణ్‌

   ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా రూపొందనున్న తొలి సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి గల్లా కుటుంబ సభ్యులతోపాటు సినీ ప్రముఖులు కృష్ణ, నరేశ్‌, రామ్‌ చరణ్‌, రానా తదితరులు హాజరై సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌ చరణ్‌ క్లాప్‌ కొట్టారు. గల్లా జయదేవ్‌ దంపతులు, గల్లా అరుణకుమారి, కృష్ణ కలిసి స్క్రిప్టును దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యకు అందించారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఫేం నిధి అగర్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్‌ బాణీలు అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్లా పద్మావతి నిర్మాత. సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి కలిసి సినిమాను సమర్పిస్తున్నారు.

ముహూర్తానికి ముందు ఫంక్షన్ హాల్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య

  పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులతో ఆ ఫంక్షన్ హాల్ అంతా సందడి నెలకొంది. ముహూర్తానికి సమయం దగ్గరపడుతోందని తొందర మొదలైంది. అంతలోనే అదే వేడుకలో విషాదం నిండుకుపోయింది. ఫంక్షన్ హాల్ లోని గదిలోనే పెళ్లి కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లిలోని ఫంక్షన్ హాల్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు.   

వేలాది 'మంచు గుడ్లు'.. అబ్బుర పరుస్తోన్న ఫొటోలు

  సాగర తీరాన నడుచుకుంటూ వెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంటే మన మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలా మంది సాగర తీరానికి చేరుకుంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీచ్ కు వెళ్లిన ఫిన్లాండ్ వాసులు ఇటీవల అపురూప దృశ్యాలను చూశారు.       కోడి గుడ్ల లాంటి మంచు ముక్కలతో వారు ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ రిస్టో మాటిలా కూడా ఈ అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీటికి 'మంచు గుడ్లు' అని పేరు పెట్టారు.         సముద్ర తీరంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా భారీ పరిమాణంలోని మంచు పలకకు ఇలా విడిపోయి చిన్న చిన్న ముక్కలైపోయాయి. అవి గుండ్రంగా మారి కోడి గుడ్లు, టెన్నిస్ బంతులు, ఫుట్ బాల్స్ పరిమాణంలో కనపడ్డాయి.  ఇటువంటి అద్భుతమైన దృశ్యాలను తాము ఎన్నడూ చూడలేదని పర్యాటకులు మీడియాకు తెలిపారు. ఉష్ణోగ్రత భారీగా పడిపోయి సముద్ర ఒడ్డున ఈ ఆకారాల్లో మంచు ముక్కలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఫిన్లాండ్, స్వీడన్ మధ్య ఉన్న ఓ ద్వీపంలో...

కాకినాడలో వ్యక్తి ప్రాణం తీసిన రెండు రూపాయల వివాదం!

    తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకలో దారుణం జరిగింది. కేవలం రెండంటే, రెండు రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, సాంబ అనే వ్యక్తి సైకిల్ షాపును నడుపుకుంటుండగా, సువర్ణరాజు అనే మరో వ్యక్తి తన సైకిల్ కు గాలి కొట్టించుకునేందుకు వచ్చాడు. సైకిల్ కు గాలి కొట్టిన తరవాత రెండు రూపాయలు ఇవ్వాలని సాంబ కోరడంతో వివాదం మొదలైంది. తనను డబ్బులు అడుగుతావా? అంటూ సువర్ణరాజు సాంబపై దాడికి దిగడంతో, అదే దారిలో వస్తున్న సాంబ మిత్రుడు అప్పారావు, కల్పించుకుని సువర్ణరాజును కత్తితో పొడిచాడు. దీన్ని గమనించిన స్థానికులు సువర్ణరాజును కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

సహచర న్యాయమూర్తులతో విందులో పాల్గొన్న జస్టిస్‌ గొగోయ్‌

  మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనుండడం, అటువంటి సమయంలో అందరికీ ఆమోద యోగ్యమైన కీలక అయోధ్య తీర్పు ఇవ్వడం వంటి సుమధుర ఘట్టాల నేపధ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నిన్న సహచర న్యాయమూర్తులకు విందు ఇచ్చారు. తీర్పు అనంతరం సహచరులకు విందు ఇవ్వనున్నట్లు ముందే ప్రకటించిన చీఫ్‌ జస్టిస్‌ ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ హాజరయ్యారు. తీర్పు అనంతరం  సహచర న్యాయమూర్తులను గొగోయ్‌ స్వయంగా తోడ్కోని వెళ్లడం విశేషం. సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న గొగోయ్‌ పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.  

పప్పులాంటి అబ్బాయి' పాట విడుదల చేసి కలకలం రేపిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలోంచి పప్పులాంటి అబ్బాయి పాటను విడుదల చేశారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ ఇప్పుడు పాటతో మరో వివాదం రేపేలా ఉన్నారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని పప్పులాంటి అబ్బాయి పాట ఇదిగో.. ఇది తండ్రీకొడుకుల ప్రేమను తెలిపే పాట. ఇందులో తొలి పార్ట్ తండ్రి కోణంలో, రెండో పార్ట్ కుమారుడి కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు ఎవరినైనా పోలి ఉన్నాయని మీకనిపిస్తే ఇది కేవలం యాధృచ్ఛికం మాత్రమే' అని పేర్కొన్నారు. ఈ సినిమాలోని పలు పోస్టర్ లను ఇప్పటికే వర్మ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు వాటి ద్వారా స్పష్టమైంది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి.

నక్షత్ర మండలాలు, వాల్మీకి వివరాల ఆధారంగా... రాముడి పుట్టిన తేదీ ఇదే!

  శ్రీరాముడు జన్మించిన సమయంలో ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయని, ఆయన చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడని వాల్మీకి మహర్షి, తన గ్రంథంలో చెప్పిన వివరాలతో పాటు, వనవాసానికి వెళ్లే సమయానికి రాముడికి 25 సంవత్సరాలని వెల్లడించిన విషయాలను సమగ్రంగా పరిశోధించి ఇనిస్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ (ఐ సర్వ్), ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. హిందువులు పవిత్రంగా పూజించే శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5,114, జనవరి 10వ తేదీన అర్ధరాత్రి గం12.05 నిమిషాలకు జన్మించాడని తేల్చింది. సమయ నిర్ధారణ కోసం ప్లానిటోరియం అనే సాఫ్ట్ వేర్ ను వినియోగించామని పేర్కొంది. రామాయణం నిజంగానే జరిగిందని, భరత భూమిపైనే ఆయన జన్మించి, అయోధ్య పురవీధుల్లో తిరిగారని స్పష్టం చేసింది.