Skip to main content

Posts

Showing posts from October 23, 2019

సింగరేణి కార్మికులకు దీపావళి బొనాంజా

  సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా యాజమాన్యం భారీ బోనస్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బోనస్ ను పెంచి రూ.64,700 ఇస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది రూ.60,500 బోనస్ ఇచ్చామని, ఈ ఏడాది రూ.4,200 పెంచినట్లు ప్రకటించింది. ఈ నెల 25లోగా కార్మికులకు బోనస్ అందజేయనున్నట్లు తెలిపింది. బోనస్ ప్రకటనతో కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.   

సీఎం జగన్ ని ఏకవచనంతో సంబోధిస్తారా? ఏమైపోయింది మీ సంస్కారం?: చంద్రబాబుపై బొత్స ఫైర్

ఏపీ సీఎం జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంబోధిస్తున్న తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏకవచనంతో చంద్రబాబు సంబోధిస్తారా? ఏమైపోయింది మీ సంస్కారం? ఇలాంటి భాష మాట్లాడటం న్యాయమేనా? అని ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు మాట్లాడే తీరు ఇదేనా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మైండ్ సెట్ మారనట్టు ఉందని, ఆయన వయసుకు ఉన్న గౌరవాన్ని కూడా రోజురోజుకీ తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ముందుకు, మీడియా ముందుకు వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలని, ఆ హుందాతనం బాబులో కనిపించడం లేదని అన్నారు. ‘మీరు (చంద్రబాబు) మాట్లాడిన ప్రతి మాటలోనూ నీ కడుపు మంట కనిపిస్తోంది తప్ప, వాస్తవం కనిపించట్లేదు’ అని బాబుపై ఓ రేంజ్ లో బొత్స విరుచుకుపడ్డారు.   

పీవీపీని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్ అరెస్టు!

  ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత, నిర్మాత పీవీపీని తన అనుచరులతో కలిసి బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ ను హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచిన పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అదే సమయంలో, గతంలో ఆయనపై నమోదైన కేసుల విషయంలో కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం. ఆయనపై 420, 448 తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, టెంపర్ సినిమా కోసం బండ్ల గణేశ్ కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేసినట్టు, తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించనట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి.   

వ్యక్తిగత భద్రత తగ్గించారు.. హైకోర్టును ఆశ్రయించిన పరిటాల సునీత

తన భద్రత విషయంలో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తన వ్యక్తిగత భద్రతను తగ్గించిందని ఆరోపిస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు తగ్గించారని పిటిషన్ లో పేర్కొన్నారు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా 2 ప్లస్ 2 భద్రత కొనసాగించాలని కోరారు.   

బీఎస్ ఎన్ ఎల్, ఎంటీఎన్ ఎల్ విలీనానికి కేంద్రం ఓకే

  నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు బీఎస్ ఎన్ ఎల్, ఎంటీఎన్ ఎల్ విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ సంస్థలను మూసివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈరోజు మీడియాకు వెల్లడించారు. వీటి నుంచి పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించబోవడం లేదని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు రూ.29,937 కోట్ల రివైవల్ ప్యాకేజీని అందిస్తుందని వివరించారు. 4జీ స్పెక్ట్రంను ఈ రెండు సంస్థలకు కేటాయించాలని, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వీఆర్ ఎస్ ప్యాకేజీని ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. 

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాదా

   భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయని సంగతి తెలిసిందే. 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా దాదా నియమితులయ్యారు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.   ఒక మాజీ క్రికెటర్‌ పూర్తిస్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు భారత మాజీ కెప్టెన్ కూడా. 2014లో సునీల్‌ గావాస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, వారు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలికంగా విధుల్లో ఉన్నారు. పూర్తిస్థాయిలో బ...

అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌

   నీతి, నిజాయతీ ఉండేవారు రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. తనతో 25 ఏళ్లపాటు ప్రయాణించేవారు కావాలన్నారు. మానవత్వం కోసం పరితపించే ఎవరినైనా తాను అభిమానిస్తాని చెప్పారు. అమరావతిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానని.. తన అంతిమ శ్వాస వరకు రాజకీయ పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబుతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు. గెలుపు, వ్యక్తిగత లబ్ధి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. సీఎం జగన్‌కు కేసుల భయం ఉంది ఇసుక మాఫియా ఇప్పుడు కూడా జరుగుతోందని పవన్‌ విమర్శించారు. గతంలో తెదేపా నేతలు చేస్తే ఇప్పుడు వైకాపా నేతలు చేస్తున్నారని.. దీనిలో పెద్దగా తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదన్నారు.  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని పవన్‌ ప్రశ్నించారు. ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టినా వారి నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం ని...

టీడీపీ ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చింది: ఏపీ మంత్రి బుగ్గన

  ఆంధ్రప్రదేశ్ లో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పులను, తీవ్ర గడ్డు పరిస్థితులను వారసత్వంగా తమకు ఇచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఆర్థిక మంత్రి మంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ అప్పులన్నీ తమపైకి నెట్టి  విమర్శలకు దిగిందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో రాష్ట్ర స్థానం 16కు పడిపోవడానికి యనమల అనుసరించిన విధానాలే కారణమన్నారు. వారి విధానాల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  విద్యుత్ కోతలపై వచ్చిన మీడియా కథనాలను మంత్రి ఖండిస్తూ.. పర్యావరణానికి హాని కలుగుతుందని థర్మల్ విద్యుదుత్పాదను తగ్గించామన్నారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ అర్థం లేని విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుకు క్రిసిల్ డి రేటింగ్ ఇచ్చిందనడం సరికాదన్నారు.   

ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మంచి రాజధానిని నిర్మిస్తాం: ఏపీ మంత్రి బొత్స

రాష్ట్ర రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో సంబంధించింది కాదు, ఐదు కోట్ల ప్రజానీకానికి సంబంధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మంచి రాజధానిని దీన్ని నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న రీతిలో ఈ రాజధాని ఉంటుందని, అందుకే, ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ రాష్ట్ర మంతటా పర్యటిస్తుందని, అక్కడి పరిస్థితులను బేరీజు వేస్తుందని, ప్రజల మనోభావాలను తెలుసుకుంటుందని అన్నారు. రాజధానిగా ఏ ప్రాంతాన్ని అయితే ఆ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారని, దాని ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు.   

టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశాన్ని ఈరోజు నిర్వహించి, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకోవాలని, తిరుపతిలో 250 ఎకరాలలో ఆధ్యాత్మిక సిటీ నిర్మించాలని, గరుఢ వారధి నిర్మాణ పనుల రీడిజైన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన టీటీడీ శాశ్వత  ఉద్యోగులకు రూ.14 వేల చొప్పున, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,500 చొప్పున 'బ్రహ్మోత్సవ బహుమానం' ఇవ్వాలని తీర్మానించినట్టు ఆయన చెప్పారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, మూడు నెలల్లోగా తిరుమలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని తీర్మానించినట్టు తెలియజేశారు.  టీటీడీలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను అమలు చేస్తామని, ఈవో నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి  తీర్మానం చేసిందని, టీటీడీ పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినట్టు పేర్క...

భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై: పీయూష్ గోయల్

  భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'ఇది చాలా క్లిష్టమైన సాంకేతికతకు సంబంధించిన విషయం. ఇందుకోసం విదేశీ సాంకేతికత, పెట్టుబడులు అవసరం అవుతాయి. కదులుతోన్న రైళ్లలో వైఫై అందించడానికి పెట్టుబడులతో పాటు టవర్ల ఏర్పాటు, ఇందుకు తగ్గ సామగ్రి అవసరం ఉంటుంది' అని చెప్పారు. 'అయితే, రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి కంపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ లకు లైవ్ ఫీడ్ అందుతుంది. వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తాం. ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఈ సంఖ్యను 6,500కు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం' అని గోయల్ తెలిపారు. 'ప్రయివేటు సంస్థల ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను కొనసాగిస్తున్నాం. భోపాల్ లో ఇటువంటి విధానాన్నే అమలు చేస్తున్నాం. అక్కడి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ముగింపు దశకు...

ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నా.. జగన్ కు మా బస్సులే కనిపిస్తున్నాయి: జేసీ దివాకర్ రెడ్డి

  జగన్ పాలనకు 100 మార్కులకు గాను 150 మార్కులు వేయాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సెటైర్ వేశారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని అన్నారు. అయితే, పాలనలో మాత్రం కింద, మీద పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులున్నప్పటికీ... జగన్ కు తమ బస్సులే కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని చెప్పారు. 70 ఏళ్ల నుంచి ట్రావెల్స్ రంగంలో ఉన్నామని... చిన్నచిన్న పొరపాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజమేనని చెప్పారు. తమ బస్సులను మాత్రమే బూతద్దంలో చూస్తూ సీజ్ చేస్తున్నారని... ఫైన్ లతో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంపై కోర్టుకు వెళతామని చెప్పారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని అన్నారు.

తేజస్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులకు రైల్వే 1.62 లక్షల రూపాయలు చెల్లించింది.

ఢిల్లీ-లక్నో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడుపుటలో అక్టోబర్ 19 న మూడు గంటలకు పైగా ఆలస్యం కావడం వల్ల ఐఆర్‌సిటిసికి రూ .1.62 లక్షలు ఖర్చవుతుంది, రైల్వే అనుబంధ సంస్థ తన బీమా కంపెనీల ద్వారా 950 మంది ప్రయాణికులకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. భారత రైల్వే చరిత్రలో మొదటిది అని అధికారులు సోమవారం చెప్పారు. ఉదయం 6.10 గంటలకు బయలుదేరే బదులు లక్నో నుంచి ఉదయం 9.55 గంటలకు ప్రారంభమైన ఈ రైలు మధ్యాహ్నం 12.25 కి బదులుగా మధ్యాహ్నం 3.40 గంటలకు న్యూ ఢిల్లీ  చేరుకుంది. ఇది న్యూ ఢిల్లీ నుండి మధ్యాహ్నం 3.35 కి బదులుగా సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, రాత్రి 10.05 కి బదులుగా రాత్రి 11.30 గంటలకు లక్నోకు చేరుకుంది. లక్నో నుండి ఢిల్లీకి 450 మంది ప్రయాణికులు ఉన్నారు, ఒక్కొక్కరికి 250 రూపాయలు పరిహారంగా లభిస్తుంది, ఢిల్లీ  నుండి లక్నో వరకు ఉన్నారు సుమారు 500 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి 100 రూపాయలు చెల్లించనున్నట్లు అధికారి తెలిపారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రతి టికెట్‌తో అందించబడిన బీమా సంస్థ యొక్క లింక్ ద్వారా ప్రతి ప్రయాణీకుడు పరిహారాన్ని పొందవచ్చని ఒక అధికారి తెలిపారు. కాన్పూర్ సమీపంలో...

రతన్ టాటాకు జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను: కేశినేని నాని

 విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు స్వస్థ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఆ సంస్థ అధినేత రతన్ టాటాకు కృతజ్ఞతలు తెలిపారు. 'రతన్ టాటా గారు టాటా ట్రస్టు ద్వారా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 265 గ్రామాలకు చెందిన 10 లక్షల మంది ప్రజలకు చేస్తోన్న సేవలు అమోఘం. నేను ఆయనకి జన్మ జన్మలకు రుణ పడి వుంటాను' అని ట్వీట్ చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందుతోందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేశినేని నాని పోస్ట్ చేశారు. కాగా, కేశినేని నాని చొరవతో మూడేళ్ల క్రితం ఇక్కడ బీమా కార్డులను జారీ చేశారు. రెండేళ్ల క్రితం టెలీమెడిసిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఆ నియోజక వర్గ పరిధిలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో అక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.   

మనం వారితో పోరాటం చేసి బయటపడాలి: తీహార్ జైల్లో డీకేతో సోనియాగాంధీ

మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం తీహార్ జైలుకు వెళ్లి శివకుమార్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో డీకే సురేశ్ మాట్లాడుతూ, శివకుమార్ వెంట పార్టీ మొత్తం ఉంటుందని సోనియా తెలిపారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసును పెట్టారని... ఇతర కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేశారని... బీజేపీతో మనం పోరాటం చేసి, బయటపడాలని సోనియా చెప్పారని తెలిపారు.

నాసా తాజా చిత్రాల్లోనూ కనిపించని 'విక్రమ్' జాడ!

  చంద్రయాన్‌-2లో భాగంగా భారత శాస్త్రవేత్తలు జాబిల్లిపై పరిశోధనల కోసం ప్రతిష్టాత్మకంగా పంపిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ జాడ చిక్కలేదు. తొలి లూనార్‌ డే సమయంలో పలు చిత్రాలు తీసిన నాసా జాడ కనిపించలేదని ప్రకటించింది. తాజా లూనార్‌ డే సందర్భంగా నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) ఈనెల 14న కూడా పలు ఫొటోలు తీసింది. అయితే, ఈ ఫొటోల్లోనూ విక్రమ్‌ కనిపించలేదని ప్రకటించడంతో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ‘అక్షాంశం తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఆ నీడలోనైనా ల్యాండర్‌ ఉండాలి. లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల అయినా ఉండొచ్చు’ అని ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌కెల్లర్‌ తెలిపారు.   

కుప్పంలో రాజీనామా చేసి గెలవండి...చంద్రబాబుకు విజయసాయి సవాల్

 ప్రజలు తనను కలవరిస్తున్నట్లు భావిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలవాలని వైసీపీ నేత విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేశారు. నాలుగు మాసాల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదని...13 జిల్లాల్లోని 5 కోట్ల మంది జనమన్నారు. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నట్లు భావిస్తే తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. ఒక వ్యక్తి తన టచ్ మహిమతో దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ కోలుకోకుండా చేశారంటూ చంద్రబాబుపై విరుచుకపడ్డారు. వచ్చే జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2021 మేలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరూ ఊహించగలిగిందేనన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు బీజేపీ క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా సీఎం జగ...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..

ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా. దీనికి బీజేపీకి చెందిన నేత కౌంటర్ ఇచ్చారు. ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు. ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా. బాలీ...

ఇసుక పాలసీ పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష

 రాష్ట్రంలో ఇసుక పాలసీ పై ఇవాళ ఉదయం పదిన్నరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సమీక్ష. ఇసుక కొరతను అధిగమించడం, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్.ఉదయం 11 గంటలకు గోదావరి, కృష్ణా నదులలో కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ఎన్జీవోలతో సీఎం జగన్ సమావేశం. మధ్యాహ్నం 12.30కి కోడిగుడ్లు సేకరణ , పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజనంపై ఉన్నతాధికారుల తో సీఎం జగన్ సమావేశం.

రేవంత్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టిన హైదరాబాద్ పోలీసులు!

రెండు రోజుల క్రితం జరిగిన విపక్షాల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో, పోలీసుల కళ్లుగప్పి బైక్ పై వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అతన్ని తోసి వేశారన్న అభియోగాలతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. కాగా, సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వేళ, తనను అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డిని రేవంత్ పక్కకు తోసేశారు. ఈ ఘటనలో నవీన్ రెడ్డికి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. రేవంత్ పై ఐపీసీలోని సెక్షన్ 341, 332, 353ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు.

తిరుమల వెంకన్నను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం తొలుత వరాహస్వామిని దర్శించుకున్న తమిళి సై అనంతరం వీఐపీల సేవా సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డిలు గవర్నర్‌కు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల గవర్నర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను శ్రీవారి భక్తురాలినని, స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వహణ బాగుందని కితాబిచ్చారు.

40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తగ్గిన ఓజోన్ రంధ్రం పరిమాణం: నాసా

ప్రపంచం అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం వెనుకబడే ఉంది. సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేసే ఓజోన్ పొర వాతావరణ కాలుష్యం కారణంగా పాడైపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఈ ఏడాది తగ్గిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు చెప్పారు. గత 40 ఏళ్లలో ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఎన్నడూ లేనంత అత్యల్పంగా ప్రస్తుతం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, రెండు నెలల్లో భూమి పై వాతావరణంలో వేడి ఉండడంతోనే ఓజోన్ పరిమాణం తగ్గిందని, అది పూర్తిగా కోలుకున్నట్లు భావించే పరిస్థితి లేదని వివరించారు. ప్రతి ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో ఓజోన్ రంధ్రం దాదాపు 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రంధ్రం పరిమాణం ఈ సారి మాత్రం సగానికి (10 మిలియన్ చదరపు కి.మీ) తగ్గినట్లు చెప్పారు. ఉపగ్రహ డేటా ఆధారంగా నాసా, నోవా సంస్థలు ఈ విషయాన్ని తేల్చాయి.

మా నాన్నపై విషప్రయోగం జరిగింది: నవాజ్ షరీఫ్ కుమారుడి ఆరోపణ

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రిపై విషప్రయోగం చేశారని... అందువల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషప్రయోగం జరగడం వల్ల ఆయన ప్లేట్ లెట్ల సంఖ్య 16,000కు పడిపోయిందని తెలిపారు. తన తండ్రి ప్రమాదకర స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారని వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ఆయనను సరైన సమయంలో ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివిధ కేసుల్లో దోషిగా తేలిన షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను లాహోర్ లోని 'ది సర్వీస్' ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రినే జైలుగా మార్చేశారు. మరోవైపు, షరీఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.