జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.