Skip to main content

Posts

Showing posts from November 22, 2019

నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం జగన్ తో చర్చించా: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

బీజేపీ నేతలతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు టచ్ లో ఉంటున్నారని వార్తలు రావటంతో గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీతో పాటు, అన్ని పార్టీల నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రధాని మోదీ తనను గుర్తుపట్టి పలకరించారని, దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోరాదని సూచించారు. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సుజనా చౌదరి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన్నే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. ఈ రోజు రఘురామకృష్ణంరాజు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడం జరిగింది. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ఆర్ అండ్ బీ ముఖ్యకార్శదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి సీఎం వద్దకు వెళ్లానని చెప్పారు. వశిష్ఠ వారధి ప్రారంభోత్సవం పెండింగ్ లో ఉందని.. దీనిపై సీఎంతో చర్చించాలని కలిశానన్నారు. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా తెలుగు అభివృద్ధిపై వివరించానని సీఎంకు తెలిపానన్నార...

రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.   ప్రభుత్వం తరఫున  అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించిన అనంతరం దానికి సంబంధించిన జీవో వచ్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఎవరూ సవాల్‌ చేయకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనిపేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తక్కువ ధరకే  ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకే ప్రైవేటీకరణ నిర్ణయమని ఏజీ వివరించారు. పిటిషనర్‌ తరఫున చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని, చట్టానికి అనుగుణంగా క...

మహారాష్ట్ర్ల లో ప్రభుత్వ ఏర్పాటుపై తొలగిన తెర

మహారాష్ట్రలో అధికార ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. సీఎంగా శివసేన చీఫ్  ఉద్ధవ్   థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కనున్నాయన్నారు.  ఈ రోజు ముంబైలోని నెహ్రూ సెంటర్లో శివసేన నేతలు ఉద్ధవ్ థాకరే, అదిత్య థాకరేలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చౌహాన్ లు సమావేశమయ్యారు. ఈ భేటీలో  సీఎంగా ఉద్దవ్ థాకరే పేరుపై ఏకాభిప్రాయం కుదిరిందని శరద్ పవార్ ప్రకటించారు. ఈ మూడు పార్టీల నేతలు రేపు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ సన్నద్ధతను తెలుపనున్నట్లు శరద్ పవార్ వెల్లడించినట్లు తెలుస్తోంది. 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందించనున్నట్లు సమాచారం.  రేపు మూడు పార్టీల నేతలు మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఏర్పాటుపై ఉమ్మడిగా ప్రకటన చేస్తారని పవార్ పేర్కొన్నారు.

ఏపీలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులన్నీ రద్దు... ప్రభుత్వం కీలక నిర్ణయం

వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేసింది. కొత్త బార్ల పాలసీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త బార్ల విధానం జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. నూతన విధానం ప్రకారం బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త బార్ల లైసెన్సులను రెండేళ్ల కాలపరిమితితో మంజూరు చేస్తారు. కాగా, బార్లకు దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ పద్ధతిలో బార్లు కేటాయిస్తారు.

గంటా బీజేపీలోకి వస్తారన్నది ఊహాగానమే... వస్తే స్వాగతిస్తాం: ఎమ్మెల్సీ మాధవ్

మాజీ మంత్రి,  టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారంటూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఒకవేళ గంటా బీజేపీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని మాధవ్ స్పష్టం చేశారు. ఇక, ఇంగ్లీషు మీడియం అంశంపైనా ఆయన మాట్లాడుతూ, మాతృభాషను నేర్చుకునే హక్కును నిర్మూలించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలకు దిగరాదని హితవు పలికారు.

ఏపీ రాజధానిపై డిసెంబరు 9లోగా స్పష్టత ఇవ్వాలి... లేకపోతే అసెంబ్లీ వద్ద నిరాహార దీక్ష చేస్తాం: రాజధాని రైతులు

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు తుళ్లూరు మండలం మందడంలో సమావేశమయ్యారు. రాజధానిపై డిసెంబరు 9 లోగా స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన ప్రకటన చేయకుంటే అసెంబ్లీ వద్ద నిరాహార దీక్ష చేస్తామని రైతులు హెచ్చరించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో ఆందోళనకు గురయ్యామని తెలిపారు. రాజధానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. కాగా, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్య అంశం కాదని, లక్షల కోట్లు వెచ్చించి, లండన్ తరహా రాజధాని నిర్మించడం తమ ప్రభుత్వ స్తోమతకు తగని పని అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి ఈ విధమైన పరోక్ష వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే రాజధాని ప్రాంత రైతులు సమావేశం నిర్వహించారు.

చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డ లక్ష్మీ పార్వతి

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ విభజనకు తీర్మానం చేశారని చంద్రబాబును ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్రంగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయండని కోరుతూ కేంద్రానికి లేఖను పంపించారని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు తెచ్చుకోలేదని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా తెలుగు అకాడమీని ఇక్కడకు ఎందుకు తీసుకురాలేదన్నారు. తెలుగు భాషకు సంబంధించి మీరు చేసిందేమిటి? ఎటువంటి పోస్టులు సృష్టించారు? అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఈ దిశలో అడుగులు వేస్తోందన్నారు. తెలుగు అకాడమీని విభజించుకునే ప్రక్రియలో భాగంగా తనను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా వేయడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములను స్మరించుకునే దినాన్ని కూడా మీరు తుంగలో తొక్కారని టీడీపీ అధినేతను విమర్శించారు. మీకు తెలుగు భాష గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

వాళ్లెవరైనా ఎయిర్ పోర్టులో కనిపిస్తే చంద్రబాబు తల తిప్పుకునే వెళ్లిపోతున్నారు: పేర్ని నాని

మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు మోదీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి వంటి నేతలతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు వాళ్ల ఊసే ఎత్తడంలేదని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వాళ్లలో ఏ ఒక్కర్నీ మళ్లీ కలిసిన పాపానపోలేదని విమర్శించారు. ఒకవేళ ఆ నేతలు ఎయిర్ పోర్టులో కనిపించినా చంద్రబాబు ముఖం తిప్పుకుని వెళ్లిపోతున్నారని, ఆయన జీవితం అంతా యూటర్న్ లేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ మోదీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని, మోదీ గారిని వదులుకుని మనం చాలా తప్పు చేశామని వైజాగ్ లో టీడీపీ కార్యకర్తలతో చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. అమిత్ షాను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తండ్రీకొడుకులు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీలుపడ్డారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనవద్ద ఉన్నదాన్ని పుత్తడి అని, వేరే వాళ్ల వద్ద ఉంటే ఇత్తడి అని అంటారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా జుగుప్సాకరమని పేర్కొన్నారు.

ఈసారి సుజనా చౌదరి ఇలా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది: విజయసాయిరెడ్డి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి సుజనా చౌదరి వెరైటీగా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందన్న విజయసాయి... విలేకరులను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అర డజను బ్యాంకుల అధికారులను ఎదుట కూర్చోబెట్టుకుని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు మార్చాడో అన్నీ అర్థమవుతాయని అన్నారు. సుజనా వారి మాయా సామ్రాజ్యం మీద ఒకప్పుడు మొదటి పేజీ కథనాలతో ఆంధ్రజ్యోతి మోతెక్కించిందని... ఇప్పుడు ఆయనను జస్టిస్ చౌదరిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోందని విజయసాయి విమర్శించారు. నిన్నటి ప్రెస్ మీట్ ను లైవ్ లో, లైవ్ స్ట్రీమింగ్ లో మోతెక్కించిందంటే... దానికి కారణం పబ్లిక్ ఇంటరెస్టా లేక పబ్లిక్ గా తెలిసిపోయిన ఇంటరెస్టా? అని ప్రశ్నించారు. అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేశ్ నాయుడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద దేవినేని ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాలపై ప్రెస...

మత్స్యకార భరోసా అందనివారు బాధపడాల్సిన అవసరంలేదు: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ మత్స్యకారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన మత్స్యకార భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకార భరోసా పథకం కింద నగదు అందని వారు బాధపడాల్సిన పనిలేదని అన్నారు. అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు భరోసా అందుతుందని వివరించారు. మత్స్యకార భరోసా కింద ప్రతి శుక్రవారం కొత్త లబ్దిదారులకు నగదు విడుదల చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ ఉద్ఘాటించారు.

ఏపీ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం వైఖరిని వెల్లడించాలి: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేందుకు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చాక మాటమారుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలో మాజీ మంత్రి ఎమ్ ఎస్ ఎస్ కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరయిన లోకేశ్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధానికోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం వంచించిదని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలను సీఎం జగన్ పొమ్మంటే, తెలంగాణ రమ్మంటుందని విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ?: పవన్ కల్యాణ్

విజయనగరం జిల్లాలో గాంధీజీ విగ్రహం కింద వైసీపీ నేతలు తమ పార్టీ రంగులు వేసుకున్న ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 'వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???' అని పవన్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేసి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. కాగా, ఇటీవల అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

బుధవారం కేసు... విదేశాలకు స్వామి నిత్యానంద పరార్!

రెండు రోజుల క్రితం వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై పోలీసు కేసు నమోదుకాగా, ఆయన విదేశాలకు పారిపోయారు. ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిత్యానంద దేశం విడిచి వెళ్లారని స్పష్టం చేశారు. కాగా, అహ్మదాబాద్ లో నిత్యానంద నిర్వహిస్తున్న యోగిని సర్వజ్ఞ పీఠంలో చిన్నారులను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు రావడంతో, ఆయనపై బుధవారం నాడు పోలీసు కేసు నమోదైంది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే నిత్యానంద పారిపోయారని పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యానందపై గతంలోనూ పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రముఖ దక్షిణాది హీరోయిన్ తో ఆయన రాసలీలలు గడిపిన వీడియో కొన్నేళ్ల క్రితం బయటకు వచ్చి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. 

మద్యంతో తిరుపతి లడ్డూను పోల్చినందుకు చంద్రబాబునాయుడిపై కేసు నమోదు!

హిందువులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల లడ్డూను మద్యంతో పోల్చినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మద్యం ధరలను పెంచినట్టుగానే, తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతున్నారని, పేదలకు లడ్డూను దూరం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. మద్యం నిషేధం చేస్తామంటూ ధరలను పెంచుతున్నారని, అలాగే తిరుమలకు భక్తులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో లడ్డూ ధరలను, రూముల ధరలను పెంచుతున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయనపై తిరుపతి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తిరుమలకు దర్శనానికి వెళుతున్న సమయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వడం లేదని టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయ ఆరోపణలకు తిరుమల వెంకన్నను టార్గెట్ చేసుకోవడం ఏంటని మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఈ మాటల యుద్ధంలో బీజేపీ సైతం వచ్చి చేరింది. తిరుమలపై మంత్రి వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాల్సిందేనని దేవినేని డిమాండ్ చేశారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నాయనే చెప్పాలి. 

సీఎంగా మీ పేరును శరద్ పవార్ ప్రతిపాదించారా? అన్న ప్రశ్నకు సంజయ్ రౌత్ సమాధానం!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శదర్ పవార్ తో జరిగిన చర్చల విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. 'ముఖ్యమంత్రిగా మీ పేరును శరద్ పవార్ ప్రతిపాదించారా?' అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. 'ఇది అసత్యం. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేయే ముఖ్యమంత్రిగా ఉండాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు.   శివసేనకు చెందిన నేతే మహారాష్ట్రకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని సంజయ్ రౌత్ తెలిపారు. ఇకపై బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని, తాము తీసుకున్న నిర్ణయాన్ని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తెలుపుతామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన ముగిసిపోతుందని తెలిపారు.

ఉద్ధవ్, ఆదిత్యలతో అర్థరాత్రి పవార్ భేటీ... ఏం తేల్చారో మాత్రం సస్పెన్స్!

గత రాత్రి పొద్దుపోయిన తరువాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలతో సమావేశం అయ్యారు. వీరి భేటీలో ఏఏ అంశాలపై చర్చలు సాగాయన్న విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటకీ, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల పంపకం తదితరాలపైనే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, శివసేన పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదరగా, కాంగ్రెస్ కూడా మద్దతిచ్చేందుకు సానుకూలతను తెలిపింది. శరద్ పవార్, ఉద్ధవ్ ల సమావేశంలో సంజయ్ రౌత్ కూడా పాల్గొనడంతో, నేడు మూడు పార్టీలూ కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఆదివారంలోగా మహారాష్ట్ర్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయక మండలి సమావేశంలో శివసేన, ఎస్పీపీలతో కలిసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్లూ ఉప ముఖ్యమంత్...