Skip to main content

మోదీగారూ...దక్షిణాదిలో కళాకారులే లేరా : మెగాస్టార్‌ చిరంజీవి కోడలు ఉపాసన సంచలన ట్వీట్‌


 

మెగాస్టార్‌ చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన ‘ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ’ సంచలన ట్వీట్‌తో సినీవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రామ్‌చరణ్‌ సతీమణి ట్విట్టర్‌లో చేసిన ఈ కామెంట్‌ వైరల్‌గా మారింది. మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల సందర్భంగా భేటీకి ఉత్తరాదికి చెందిన హిందీ కళాకారులను మాత్రమే మోదీ ఆహ్వానించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా టెలివిజన్‌, సినీరంగాలకు చెంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఉపాసన `మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. కళాకారులతో జరిగిన సమావేశాన్ని మీరు మాత్రం  కేవలం హిందీ నటీనటులకే పరిమితం చేశారు. దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధగా ఉంది` అంటూ ట్వీట్ చేశారు.

ఇంతవరకు ఏ వివాదంలోనూ కనిపించని ఉపాసన ఏకంగా ప్రధానిని ఉద్దేశిస్తూ  చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే అని పలువురు నెటిజన్లు ఉపాసనకు మద్దతుగా నిలిచారు.   

Comments