Skip to main content

Posts

Showing posts from September 30, 2019

పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవం: విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్

రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ ఉత్పాదన తగ్గిందని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా, విమర్శల తాకిడి తప్పడంలేదు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ ను కొనుగోలు చేయవచ్చు కదా అని కూడా స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా గత 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుదుత్పత్తి సరిగా లేదని తెలిపారు. వచ్చే 7 రోజుల పాటు 8 ర్యాకుల చొప్పున బొగ్గు సింగరేణి నుంచి వస్తోందని, కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లించామని వెల్లడించారు.

కరెంటు కోతల నేపథ్యంలో.. జగన్ సర్కారుపై పవన్ కల్యాణ్ సెటైర్

ఏపీలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా స్పందించారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయని, థర్మల్ విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో కరెంటు కోతలు తప్పడంలేదని ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "క్షమించాలి, మా పనయిపోయింది" అంటూ ఏపీ సర్కారు ప్రజలకు ఈ విధంగా చెబుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా ట్వీట్ చేశారు. 'క్షీణించిపోతున్న బొగ్గు నిల్వలు: తెలంగాణ సీఎంను సాయం కోరిన జగన్' అంటూ ప్రచురితమైన కథనాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

బోటు వెలికితీత ప్రయత్నంలో అధిక బరువు లాగలేక తెగిపోయిన రోప్!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీత పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, రెండు భారీ లంగర్లతో రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం ఓ లంగరును విజయవంతంగా లక్ష్యానికి లాక్ చేయగలిగినట్టు తెలుస్తోంది. బాగా లోతున ఓ వస్తువుకు లంగరు తగలగానే దాని చుట్టూ ఐరన్ రోప్ తో లాక్ చేసిన ధర్మాడి సత్యం టీమ్ ఆపై బయటికి లాగే ప్రయత్నంలో విఫలమైంది. అధిక బరువు కారణంగా ఐరన్ రోప్ మధ్యలోనే తెగిపోయింది. అంత లోతున బోటు కాకుండా మరే ఇతర వస్తువు ఉండే అవకాశం లేదని, అది బోటే అయ్యుంటుందని ధర్మాడి సత్యం భావిస్తున్నారు. అయితే 25 టన్నుల బరువున్న ఆ బోటు, గోదావరి వరద కారణంగా ఇసుకతో నిండిపోయి మరింత బరువెక్కి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రోప్ తెగిపోయి ఉంటుందని, అసలు నీటి అడుగున ఓ బరువైన వస్తువు ఉన్నట్టు గుర్తించడం సగం విజయంతో సమానమని వెలికితీతలో పాల్గొంటున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన స్థలంలో వర్షం పడుతుండడం కూడా వెలికితీత పనులకు ఆటంకం కలిగిస్తోంది.

మన దగ్గర రాఫెల్ ఉంటే చైనా, పాకిస్థాన్ పప్పులు ఉడకవు: వాయుసేన చీఫ్

అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ భారత వాయుసేన సామర్థ్యాలను మరింత విస్తృతం చేస్తుందని నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. ఇప్పటివరకు వాయుసేన చీఫ్ గా పనిచేసిన బీఎస్ ధనోవా నేటితో పదవీవిరమణ చేశారు. ఆయన స్థానంలో భదౌరియా బాధ్యతలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్ అమ్ములపొదిలో ఉండడం వల్ల పాకిస్థాన్, చైనాలపై మనదే పైచేయి అవుతుందని, వాళ్ల పప్పులు వుడకవని స్పష్టం చేశారు.  "రాఫెల్ అత్యంత సమర్థవంతమైన యుద్ధవిమానం. ఒక్కసారి వాయుసేనలో చేరిందంటే కచ్చితంగా మనదే ఆధిపత్యం అవుతుంది. ఎస్ యూ-30 విమానాలు, ఇతర యుద్ధవిహంగాల కాంబినేషన్లో రాఫెల్ ను ఉపయోగించినప్పుడు ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలుస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. విశేషం ఏంటంటే, 2016లో రూ.60 వేల కోట్ల విలువైన రాఫెల్ విమానాల ఒప్పందం కుదరడంలో కీలకపాత్ర పోషించింది భదౌరియానే. 36 రాఫెల్ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ వెళ్లిన భారత ప్రతినిధుల బృందానికి ఆయనే చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిన ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం: జగన్ సర్కారుపై ధ్వజమెత్తిన చంద్రబాబు

ఏపీ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావిస్తూ, పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిన ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం అని వ్యాఖ్యానించారు. ఇది రివర్స్ డెవలప్ మెంట్ ప్రభుత్వం అని, అందుకే కరెంటు కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సర్కారు తీసుకువచ్చిన నిరంతర విద్యుత్ ను కూడా రివర్స్ చేశారని మండిపడ్డారు. 9 గంటల విద్యుత్ అని చెప్పి సగం కోత విధించారని చంద్రబాబు ట్విట్టర్ లో ఆరోపించారు. థర్మల్ విద్యుత్ ఎప్పుడూ ఆధారపడదగింది కాదని, పైగా పర్యావరణ హితం కూడా కాదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని తాము ఎప్పుడో ఊహించామని, అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తిని భారీస్థాయిలో ప్రోత్సహించామని తెలిపారు. తనకు తెలియంది ఎవరైనా చెబితే వినిపించుకోడని, ఆ జగమొండితనమే రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శాపం అయిందని చంద్రబాబు విమర్శించారు.

ప్రభుత్వ లక్ష్యం మేరకు సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి : మంత్రి పెద్దిరెడ్డి

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సమున్నత ఆశయంతో గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెస్తోందని, ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. అమరావతిలో ఈరోజు అర్హులైన వారికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం సాధారణ విషయం కాదని, ఉద్యోగాలు పొందిన వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు ఎంత బాధ్యతగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత పేరు వస్తుందని అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు ఎంతో పగడ్బందీగా నిర్వహించినప్పటికీ విపక్షాలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

వెన్నునొప్పికి ఆపరేషన్‌ వద్దంటున్న పవన్‌...ప్రకృతి వైద్యం వైపు జనసేనాని మొగ్గు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఆరోగ్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో అది ఎక్కువ కావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యుల బృందం పరిస్థితి మరింత విషమించక ముందే శస్త్ర చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అయితే ఇందుకు పవన్‌ కల్యాణ్‌ అంగీకరించలేదని సమాచారం. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి నేచర్‌ క్యూర్‌ పద్ధతి (ప్రకృతి వైద్యం)లో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట

నేటితో ఆ మద్యం బంద్: ఇక అంతా ప్రభుత్వమే: బీర్లు మాత్రం కష్టమే..!

ఏపీలో దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా కీలక నిర్ణయాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా ఇక రోజుతో ప్రైవేటు మద్యం బంద్ కానుంది. రేపటి నుండి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిం చాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే వ్యాపారం చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు షాపులను ఖాళీ చేస్తున్నారు. సరుకునంతా విక్రయించేసి షాపులను ఖాళీచేసే పనిలో ప్రైవేటు మద్యం వ్యాపారులు బిజీగా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సంధి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరక్క.. దొరికినా ఇష్టమైన బ్రాండు లభించక మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి.. 3,448 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. ఇక ప్రైవేటు మద్యం బంద్.. ఏపీలో పదిహేనేళ్ల తరువాత పూర్తిగా ప్రైవేటు మద్యం రద్దవుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా మద్యపాన నిషేధం అమ...

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

 ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగర్జునసాగర్‌లోకి వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు 4 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో 1.24 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్‌ పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 311.74 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు నివేదిక వెల్లడించారు.

ఇంద్రకీలాద్రిపై పెరిగిన రద్దీ... బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

దసరా నవరాత్రులు, బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజులపాటూ... దుర్గాదేవి అమ్మవారు... 10 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. తొలిరోజైన నిన్న... అమ్మవారు... స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చారు. నేడు... బాలత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇస్తున్నారు. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ అమ్మవారి అధీనంలో ఉంటాయి. అభ‌య‌ హ‌స్త ముద్రతో ఉండే ఈ త‌ల్లి అనుగ్రహం కోసం... ఉపాసకులు బాల రచన చేస్తారు. ఈ రోజు 2 నుంచి 10 ఏళ్ల లోపు బాలిక‌ల్ని అమ్మవారి స్వరూపంగా... పూజించి... కొత్త బట్టలు పెడతదారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి... పాయసం, గారెలను నైవేద్యంగా ఇస్తారు. బాల త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు అక్టోబర్ 1న అమ్మవారు... గాయత్రీ దేవిగా, 2న అన్నపూర్ణాదేవిగా, 3న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 4న మహాలక్ష్మి దేవిగా, 5న సరస్వతీ దేవిగా, 6న దుర్గాదేవిగా, 7న మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక దసరా నాడు అక్టోబర్ ...

అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న ఆర్మీ చీఫ్... భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే LOC దాటి వెళ్లి మరీ యుద్ధం చేస్తామన్నారు. కిస్థాన్-భారత్ వాస్తవాధీన రేఖను దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. పాకిస్థాన్ తీరు మార్చుకోనంతవరకూ తమ దాడులు కొనసాగుతాయన్నారు ఆయన. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడిన ఆయన... ఇకపై "హైడ్ అండ్ సీక్‌"లు కుదరవన్న ఆయన... ఇండియా గనక సరిహద్దు దాటాలని అనుకుంటే... గగనతలంలో, భూ మార్గంలో లేదా రెండు మార్గాల్లోనూ దాటతామని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న ఆయన... పొరుగు దేశం కావాలనే ప్రచ్ఛన్న యుద్ధం జరిపిస్తోందని అన్నారు. అణ్వాయుద్ధాలతో యుద్ధం చేస్తామన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని కూడా బిపిన్ రావత్ కొట్టిపారేశారు....

4న వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ప్రారంభం

పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి - 30 వరకు దరఖాస్తుల పరిశీలన ఆటోలు, మాక్సీక్యాబ్‌, టాక్సీలు కొనుగోలు చేసి, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టనున్న వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అక్టోబర్‌ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 14 నుండి 24 వరకు ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఇన్స్యూరెన్స్‌, వెహికిల్‌ ఫిట్‌ నెస్‌, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లు వాహన మిత్ర పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్‌ కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రుణం లేని బ్యాంక్...

ప్రారంభమైన బోటు వెలికితీత పనులు.. అవసరమైన సామగ్రితో ఘటనా స్థలానికి బయలుదేరిన సత్యం బృందం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఇటీవల పర్యాటకులతో వెళ్తూ మునిగిపోయిన బోటును వెలికి తీసే పనులు ప్రారంభమయ్యాయి. బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన నేవీ, సహాయక బృందాలు వెనుదిరగడంతో ప్రభుత్వం ఆ బాధ్యతను బాలాజీ మెరైన్ సంస్థకు అప్పగించింది. దీంతో సంస్థ యజమాని ధర్మాడి సత్యం.. తన బృందం సభ్యులైన 25 మందితో వెలికితీతకు బయలుదేరారు. బోటును వెలికి తీసేందుకు అవసరమైన క్రేన్, ప్రొక్లెయిన్, బోటు, పంటు, 800 మీటర్ల వైరు బోటు, రెండు లంగర్లు, మూడు లైలాండ్ రోప్‌లు, పది జాకీలు, ఇతర సామగ్రిని ఘటనా స్థలానికి తరలిస్తున్నారు. బోటు వెలికితీత నేపథ్యంలో ఆ  ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

నువ్వు ట్విట్టర్ లో రాసుకుందే చరిత్ర అనుకుంటే ఎలా శకుని మామా?: బుద్దా వెంకన్న

టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో వైసీసీ నేత విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆర్టీసీని అప్పుల బారి నుంచి రక్షించి అనేక అవార్డులు వచ్చేలా చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు అని తెలిపారు. ఆర్టీసీని నాశనం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది మీ మహామేత అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జరిగిన వాస్తవం ఇదైతే, నువ్వు ట్విట్టర్ లో రాసుకుందే చరిత్ర అనుకుంటే ఎలా శకుని మామా? అంటూ ట్వీట్ లో నిలదీశారు. శకుని మామా, ఎవరి హయాంలో ఆర్టీసీ నాశనమైందో ఓ పుస్తకం తయారుచేసి పంపిస్తాను, తీరిగ్గా చదువుకుందువుగాని అంటూ వ్యాఖ్యానించారు. "అప్పుడప్పుడు కాస్త వేరే పేపర్లు కూడా చదువుతుండు శకుని మామా, మీ తుగ్లక్ పాలన ఎంత బాగుందో అర్థమవుతుంది. 90 శాతం వలంటీర్లు మన కార్యకర్తలే అని పబ్లిగ్గా మాట్లాడిన నువ్వా వారి ఘనకార్యాల గురించి మాట్లాడేది?" అంటూ విమర్శించారు.