తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. కొత్తగా అద్దె బస్సులకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్ జారీ చేయాలని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టాలని ఆదేశించారు. సమ్మెలో పాల్గొన్నవాళ్లను మళ్లీ విధుల్లోకి తీసుకోరాదని హుకుం జారీ చేశారు. సమ్మెలో పాల్గొనకుండా దూరంగా ఉన్నవారికి మాత్రం సెప్టెంబరు నెలకు వేతనాలు చెల్లిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.