ఓవైపు కేంద్రం ప్రభుత్వం అధికారిక మ్యాప్ లో అమరావతికి చోటు కల్పించినా, సీఎం జగన్ అమరావతి నిర్మాణపనులపై సమీక్ష నిర్వహించినా ఏపీ రాజధానిపై ఇప్పటికీ అనిశ్చితి తొలగిపోలేదు. ఏపీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధానిపై పూర్తిస్థాయిలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, చంద్రబాబు అమరావతి పర్యటనపైనా విమర్శలు చేశారు. రాజధానిలో ఏంచూడ్డానికి బాబు వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన లోటు వచ్చే 20 ఏళ్లలో కూడా తీర్చలేమని అన్నారు. వేల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఏం సంపద సృష్టించారని నిలదీశారు. రాజధానినే కాదు 2004కు ముందు రాష్ట్రాన్నే బాబు శ్మశానం చేశారని మండిపడ్డారు. దేవాలయంలా భావిస్తే రాజధాని నిర్మాణం ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాజధాని పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని బొత్స స్పష్టం చేశారు.