Skip to main content

Posts

Showing posts from October 9, 2019

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ:  పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. ప్రముఖ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. టెండర్ నామినేషన్ల పద్ధతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి తక్షణం విచారణ జరపాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలపై పుల్లారావు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేదే తన ఉద్దేశమని, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులే.. మళ్ళీ కొత్త ప్రభుత్వంలో భాద్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ...

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తాం: చాడ వెంకట్ రెడ్డి

హుజూర్ నగర్ కు త్వరలో జరగనున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మద్దతుపై పునరాలోచన చేయనుంది. తెలంగాణలో ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న టీఎస్సార్టీసీ సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచన చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా రేపు అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి నిరసన తెలుపుతామని చెప్పారు.   

తెలంగాణ బంద్ పై రేపు ప్రకటిస్తాం: ప్రొఫెసర్ కోదండరామ్

  టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడాన్ని కార్మికులు నిరసిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బంద్ పై రేపు మధ్యాహ్నం ఓ ప్రకటన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మె గా మారుతుందని హెచ్చరించారు. సమ్మెపై గవర్నర్ తమిళిసైని కలిసి ఓ వినతిపత్రం అందజేయాలని అఖిలపక్షాల నేతలు నిర్ణయించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర జరుగుతోందని, దీన్ని అన్ని పార్టీలు అడ్డుకోవాలని కోరారు.   

గోదావరిలో పడవ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించాలి: కళా వెంకట్రావు డిమాండ్

ఏపీలోని కచ్చులూరులో ఇటీవల జరిగిన పడవ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదావరిలో పడవ ప్రమాద ఘటన జరిగి ఇన్నిరోజులు కావస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం, ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రమాద ఘటన జరిగిన ఇరవై మూడురోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తగు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రమాదానికి గురైన బోటు నదిలో మూడొందల అడుగుల కింద ఉందని, ముఖ్యమంత్రి మూడు వేల అడుగుల పై నుంచి సర్వే చేసి వచ్చేశారని విమర్శించారు.

కేంద్ర హోం శాఖ కార్యాలయంలో విభజన చట్టంపై ముగిసిన భేటీ

 కేంద్ర హోం శాఖ కార్యాలయంలో విభజన చట్టంపై జరిగిన సమావేశం ముగిసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటల సమయం ఈ సమావేశం కొనసాగింది. షెడ్యూల్ 9,10 జాబితాలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఉద్యోగులు, ఆస్తుల పంపకాలు, సింగరేణి, ఆర్టీసీ, పౌరసరఫరా సంస్థలు, కార్పొరేషన్లపై, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సంస్థల విభజనపై రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై హోం శాఖ కార్యదర్శి వివరణ కోరినట్టు సమాచారం.   

కాకాణికి, నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి కి మధ్య విభేదాలను పరిష్కరించే నిమిత్తం నెల్లూరు జిల్లా నేతలతో ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో కోటంరెడ్డి మాట్లాడుతూ, కాకాణికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాకాణి స్వయానా తన మేనత్త కొడుకు అని తెలిపారు. ఈ సమావేశంలో ‘రైతు భరోసా’, త్వరలో జరగనున్నసీఎం సభపై మాత్రమే చర్చించామని చెప్పారు. 

నాకు, కోటంరెడ్డికి మధ్య ఎటువంటి గొడవలు లేవు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కాకాణి గోవర్దన్ రెడ్డికి మధ్య గ్రూప్ తగాదాలు నెలకొన్నాయన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తనకు, కోటంరెడ్డికి మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని స్పష్టం చేశారు. కోటంరెడ్డి స్వయానా తన బావమరిది అని, చిన్నప్పటి నుంచి తాము ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని అన్నారు. ఒకవేళ తమ మధ్య ఏమైనా విభేదాలు వస్తే తామే పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం తమకు ఉందని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తమ మధ్య వివాదాలు సృష్టించాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.   

ఆర్టీసీ కార్మికుల కోసం రోడ్లపైకి రావడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారు: జనసేన

తమ డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో... ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. తెలంగాణ బంద్ కు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు, హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.  ఈ సమావేశంలో జనసేన నేత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పూర్తి మద్దతు తెలుపుతోందని తెలిపారు. జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ సహకారం అందిస్తుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల తరపున ఉద్యమించడానికి, రోడ్ల మీదకు రావడానికి తమ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇదే సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ, తమ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతివ్వాలని కోరా

ఆల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ.. వైమానిక దాడుల్లో కీలక నేత హతం

  ఆఫ్ఘనిస్థాన్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆల్‌ఖైదా కీలక నేత ఆసిం ఉమర్ హతమైనట్టు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, తాము గతంలో నిర్వహించిన దాడుల్లో ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ మృతి చెందిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే, అతడిని ఎప్పుడు హతమార్చిందన్న వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

24 గంటల ఎన్ కౌంటర్ తరువాత... రెండో ఉగ్రవాదిని మట్టుబెట్టిన

భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు దాదాపు 24 గంటల పాటు జరిపిన ఎన్ కౌంటర్ అనంతరం అవంతిపొరాలో దాగున్న రెండో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. నిన్న తెల్లవారుజామున ఓ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు దాగున్నారన్న సమాచారాన్ని అందుకున్న సైన్యం, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఒకరిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఆపై రెండో ఉగ్రవాది కోసం వేట కొనసాగింది. తుపాకుల చప్పుళ్లు, గ్రనేడ్ పేలుళ్లతో ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఉదయం హతుడైన ఉగ్రవాదిని జైషే మహమ్మద్ కు చెందిన ఉఫైద్ ఫరూల్ అని గుర్తించామని సైన్యాధికారి ఒకరు తెలిపారు. షాపులపై దాడులు చేయడంతో పాటు దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఇతనిపై పలు కేసులు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన ఉగ్ర కార్యకాలాపాల్లో ఇతని పాత్ర ఉన్నట్టు తేలిందని తెలిపారు. స్థానిక యువతను ఉగ్రవాదుల్లో చేరాలంటూ ఫరూల్ ఉసిగొల్పేవాడని అధికారులు తెలిపారు. ఇతని కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచామని అన్నారు. కాగా గత నెల 28 నుంచి ఇప్పటి వరకు నాలుగు ఎన్‌కౌంటర్‌ లను సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది.

రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. 50 మందికిపైగా గాయాలు

కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం నిన్న రక్తసిక్తమైంది. దాదాపు 50 మంది గాయపడగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ ఇలవేల్పును దక్కించుకునేందుకు ఏటా విజయదశమి రోజున ఐదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడడం ఆచారంగా వస్తోంది. నిన్న జరిగిన కర్రల సమరం హోరాహోరీగా సాగింది. ఇలవేల్పు కోసం కర్రలతో తలపడి ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ ఆచారం హింసాత్మకంగా ఉండడంతో దీనిని నివారించేందుకు గత కొంతకాలంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, లఘు చిత్రాలు ప్రదర్శించడం వంటి అవగాహన కార్యక్రమాలను నెల రోజుల ముందు నుంచే చేపట్టినప్పటికీ సమరాన్ని మాత్రం నిలువరించలేకపోయారు. దీంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్ వాహనాలతో నిఘా పెట్టారు. వెయ్యిమందికి పైగా పోలీసులను మోహరించి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు.