సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓవైపున ప్రభాస్ ఉండగా, మరోవైపున ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆడియో కంపెనీ టీ సిరీస్ ప్రతినిధి ఉండడం చూడొచ్చు. టీ సిరీస్ ప్రతినిధి మాట్లాడుతూ, "హాయ్ ప్రభాస్, రేపటికి మీరు రెడీగా ఉన్నారా?" అని ప్రశ్నించగా, "చాలా ఎక్సైటింగ్ గా ఉంది, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను" అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. "లెట్స్ డూ ఇట్" అంటూ టీ సిరీస్ ప్రతినిధి ఉత్సాహంగా పిడికిలి బిగించాడు. ప్రభాస్ కూడా చిరునవ్వుతో పిడికిలి బిగించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ప్రభాస్... టీ సిరీస్ నిర్మాణంలో ఓ బాలీవుడ్ సినిమా చేయనున్నట్టు అర్థమవుతోంది. కరణ్ జొహార్ తో కానీ, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో కానీ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశాన్ని టీ సిరీస్ నిర్మాణ సంస్థ చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. రేపు ప్రభాస్ చెప్పే మ్యాటర్ తో దీనిపై మరింత క్లారిటీ రానుంది.