Skip to main content

Posts

Showing posts from November 8, 2019

అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు రేపే... సర్వత్రా ఉత్కంఠ!

దశాబ్దాల తరబడి దేశంలో అనేక సంఘటనలకు, తీవ్రస్థాయి రాజకీయ పరిణామాలకు కారణమైన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు రేపు తుది తీర్పు వెలువరించనుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు వస్తుందని భావిస్తున్నారు. మరికొన్నిరోజుల్లో రంజన్ గొగోయ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపే అత్యంత ముఖ్యమైన అయోధ్య తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే మునుపెన్నడూ లేనంత వేగంగా కొన్నిరోజులుగా ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తి చేసి అంతిమ తీర్పుకు కసరత్తులు చేశారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఒక్క అయోధ్యలో భద్రత కోసమే 4,000 మంది పారామిలిటరీ సిబ్బందిని తరలించారు. ఇవాళ ఉదయం నుంచే యూపీ సర్కారు కదలికలు అయోధ్య తీర్పు వేగిరమే వస్తుందన్న అంచనాలను బలపరిచాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో యూపీ ఉన్నతాధికారులు ఆయన చాంబర్ లోనే భేటీ అయ్యారు.