Skip to main content

Posts

Showing posts from August 6, 2020

సోమువీర్రాజుతో చిరంజీవి భేటీ.. ఆయ‌న ఆకాంక్ష ఇదే..!

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త చీఫ్ సోము వీర్రాజును క‌లిశారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు ఈ సంద‌ర్భంగా అభినందనలు తెలిపారు చిరంజీవి.. పుష్పమాల, శాలువాతో సత్కరించిన చిరంజీవి... జ‌న‌సేన అధినేత, త‌న తమ్ముడు పవన్ క‌ల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల‌ పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.. 2024లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాక్షించారు చిరంజీవి. కాగా, గ‌త ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీచేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎన్నిక‌ల త‌ర్వాత ప‌లు ద‌ఫాలుగా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు, బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని క‌లిసి.. ఆ పార్టీకి చేరువైన సంగ‌తి తెలిసిందే.    

ఏపీలో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభం ఉన్నత విద్యపై సీఎం జగన్‌ సమీక్ష

ఆం ధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధన జరగాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం జగన్‌ అనుమతిచ్చారు.

అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో ఆ వివరాలు కావాలన్న హైకోర్టు

  అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రాజధాని నిధుల వ్యయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు రూ.52 వేల కోట్లు ఖర్చు చేశారని న్యాయవాది మురళీధర్ సీఆర్డీఏ రికార్డులను కోర్టుకు సమర్పించారు.  ఈ సందర్భంగా, రూ.52 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? అంటూ కోర్టు ప్రశ్నించింది. దానికి సంబంధించిన సమగ్ర వివరాలు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. రాజధాని అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో ఆ వివరాలు కూడా అందించాలని కోరింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  అమరావతిలో వెచ్చించిన సొమ్ము ప్రజల సొమ్ము అని, వృథా అయితే రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తుందని పేర్కొంది. నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను ఎవరూ వాడకుంటే అవి పాడైపోతాయని, ఆ నష్టం ఎవరు భరించాలని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 14న ఉంటుందని వెల్లడించింది.  

రాజధానితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: ఏపీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ

 ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది. మూడు రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్ర పరిధిలోదా? లేక రాష్ట్ర పరిధిలోదా? అనే అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్ లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని చెప్పింది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరోవైపు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు 10 రోజుల పాటు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే.  

ముంచెత్తిన వర్షాలు.. మునిగిన ముంబయి!

  ముంబయి మహానగరం కుండపోత వర్షాలతో తల్లడిల్లుతోంది. గత మూడ్రోజులుగా ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ ఉదయం వరుణుడు శాంతించినా అప్పటికే నగరం నీట మునిగింది! లోతట్టు ప్రాంతాలే కాదు రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు తోడు 70 కిమీ వేగంతో గాలులు కూడా వీయడంతో చెట్లు కూలిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. షేక్ మిస్త్రీ దర్గా రోడ్, బీపీటీ కాలనీ, ఖేత్వాడి, నాయర్ హాస్పిటల్, సీపీ ట్యాంక్ ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఇక దక్షిణ ముంబయి ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 12 గంటల వ్యవధిలో 294 మిమీ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో ఈ మేర వర్షపాతం నమోదవడం 1974 తర్వాత ఇదే ప్రథమం. అటు, తీవ్ర వర్షాలతో బాంబే హైకోర్టు తన కార్యకలాపాలన్నీ రద్దు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 5 బృందాలు ముంబయిలో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.