Skip to main content

రామేశ్వరం నుంచి శ్రీలంకకు.. కోటి రూపాయల విలువైన జలగల అక్రమ రవాణా

  రామేశ్వరం నుంచి శ్రీలంకకు పడవలో అక్రమంగా సముద్రపు జలగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల విలువైన జలగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జలగలను శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రామేశ్వరం పులిదేవన్‌నగర్ ప్రాంతంలోని ఓ తోటలో జలగలను దాచి ఉంచినట్టు తెలిసింది. దీంతో అక్కడకు చేరుకుని తనిఖీలు చేయగా మూడు ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వచేసిన 150 కిలోల బరువున్న సముద్రపు జలగలు కనిపించాయి.

శ్రీలంకకు తరలించేందుకే అక్కడ దాచి ఉంచినట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని మురుగేశన్(37), మురుగయ్య (61), శక్తివేల్ (35) అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న జలగల విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Comments