తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. పార్టీకి, పదవికి రాజీనామా చేయాలంటే సంప్రదాయ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇవ్వాలని అన్నారు. వాట్సాప్ ద్వారా పంపే మెసేజ్ లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని చెప్పారు. వైసీపీ వేధింపుల వల్లే రాజీనామా చేస్తున్నానని వంశీ చెప్పారని... అలాంటప్పుడు మళ్లీ అదే పార్టీలోకి ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. వంశీ పార్టీ మారే వ్యవహారంలో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు.
మూడు రోజుల వ్యవధిలోనే చంద్రబాబు, జగన్, సుజనా చౌదరిలను వంశీ కలిశారని... ఆయన పనులను జనాలు కూడా తప్పుపడుతున్నారని బొండా ఉమా అన్నారు. వంశీతో మాట్లాడాలంటూ కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులను చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. గందరగోళ పరిస్థితులకు వంశీ ముగింపు పలకాలని తాను కోరుకుంటున్నానని... ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
Comments
Post a Comment