Skip to main content

చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారు: జోగి రమేశ్ విమర్శలు

 
ఏపీలో ఇసుక అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తాజాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పందించారు. ఇసుక విషయంలో చంద్రబాబు, పవన్ విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించాల్సిన అవసరం తమకు లేదని, ఇసుక కొరత త్వరలోనే తీరిపోతుందని అన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. వరదల కారణంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోతే, ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హయాంలో ఆయన నివాసం పక్కన కోట్ల విలువైన ఇసుకను తవ్వుకుపోతే గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. ఇక, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలైన పవన్ కల్యాణ్ కు సీఎం జగన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుందని, టీడీపీ రాష్ట్రంలో ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. అసలు, టీడీపీకి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారో, ఉండరో తెలియదని అన్నారు.

చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారని, జగన్ బాటలో నడవాలంటే విలువలకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు సీఎం జగన్ వ్యతిరేకం అని, పార్టీలోకి రావాలనుకునేవారు పదవికి రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

Comments