కీలక సమాచారం...
ఎతావి పట్టుబడటమే బాగ్దాదీని అంతమొందించే ప్రక్రియలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇస్లామిక్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఎతావి 2006లో అల్ ఖైదాలో చేరాడు. ఇరాకీ భద్రతాధికారులు చెప్పిన ప్రకారం 2008లో అతన్ని అమెరికా బలగాలు అరెస్టు చేశాయి. దీంతో నాలుగేళ్లు అతడు జైలు జీవితం గడిపాడు. తిరిగొచ్చి ఐసిస్‌లో చేరాడు. బాగ్దాదీకి కీలక అనుచరుడి స్థాయికి ఎదిగాడు. మతపరమైన బోధనలు చేయడం, ఇస్లామిక్ స్టేట్ కమాండర్లని ఎంపిక చేయడంలాంటి కీలక బాధ్యతల్ని ఎతావికి అప్పగించాడు. కానీ, అమెరికా బలగాలు ఐసిస్‌పై విరుచుకుపడటం ప్రారంభించడంతో 2017లో ఎతావి కుటుంబంతో కలిసి సిరియాకు మకాం మార్చాడు. 2018లో ఇరాక్ బలగాలు అతన్ని అరెస్టు చేసి కీలక సమాచారాన్ని రాబట్టాయి. అలాగే అమెరికా, ఇరాక్, టర్కీ బలగాలు ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆపరేషన్‌లో మరికొంత మంది ఐసిస్ నేతలు పట్టుబడడం కూడా బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టడంలో దోహదపడింది. వీరు ఐసిస్ అధినేత సంచరించే కీలక ప్రాంతాల సమాచారం ఇచ్చారు. అందుకనుగుణంగా సీఐఏ ఆయా ప్రదేశాల్లో బలగాల్ని మోహరించి ఆపరేషన్‌ని ముందుకు తీసుకెళ్లిందని ఇరాక్‌కు చెందిన ఓ భద్రతాధికారి తెలిపారు. వీరిచ్చిన సమాచారంతో సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో బాగ్దాదీ కుటుంబంతో కలిసి వివిధ గ్రామాలకుకు మారుతున్నాడని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఓ రోజు ఇరాక్‌కు చెందిన వ్యక్తి అక్కడి మార్కెట్ ప్రాంతంలో సంచరిస్తుండడం గమనించారు. అతను ఎతావి అని ధ్రువీకరించుకున్నారు. అతన్ని అనుసరిస్తూ వెళ్లారు. చివరకు అతడు బాగ్దాదీ ఉన్న ఇంటికే చేరుకున్నాడు. ఈ సమాచారాన్ని వారు సీఐఏకి అందజేశారు. దీంతో వారు గత ఐదు నెలలుగా శాటిలైట్, డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతంపై నిఘా ఉంచారు. ఇటీవల మినీబస్‌లో పక్కనున్న గ్రామానికి బాగ్దాదీ వెళ్లడం గమనించారు. అప్పటికే వారి వద్ద ఉన్న సమాచారంతో అతను బాగ్దాదీయే అని ధ్రువీకరించుకున్నారు.
స్థానిక శత్రువులు...
ఇడ్లిబ్ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తున్న జిహాదీ సంస్థ ‘హయత్ తారిర్ అల్-శామ్’ కూడా బాగ్దాదీ కోసం గాలిస్తోంది. ఈ సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తోంది. సిరియా యుద్ధంలో ఈ గ్రూపు ఐసిస్‌తో తలపడింది. అలాగే ఈ ప్రాంతంలో బాగ్దాదీ ఉంటే తమ ఉనికికి ప్రమాదం ఉండే అవకాశం ఉందని భావించిన ‘హయత్ తారిర్’ నేతలు అతడి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో బాగ్దాదీ కీలక అనుచరుడైన ఖలీదీ వీరికి పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారంతో రెండు నెలల క్రితం సర్మిన్ అనే పట్టణంపై దాడి చేశారు. కానీ, బాగ్దాదీ అక్కడి లేకపోవడంతో వెనక్కి తిరిగారు. ఇక అప్పటి నుంచి ‘హయత్ తారిర్’ నేతలు సైతం అతనిపై నిఘా ఉంచారు. స్థానికులు తెలిపిన ప్రకారం తాహిర్ సంస్థకి టర్కీ బలగాలతో సంబంధాలు ఉన్నాయి. అలా వీరి గాలింపు చర్యల పురోగతి సమాచారం కూడా నిఘా వర్గాలకు అందినట్లు భావిస్తున్నారు.
ఇలా ఎట్టకేలకు అతనిపై భారీ నిఘాతో టర్కీ, సిరియా సాయంతో అమెరికా ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు బాగ్దాదీ కదలికల్ని కచ్చితంగా పసిగట్టాయి. శనివారం రాత్రి భారీ ఆపరేషన్‌లో అతన్ని అంతమొందించాయి.
Comments
Post a Comment