Skip to main content

అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌

 
అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌
 నీతి, నిజాయతీ ఉండేవారు రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. తనతో 25 ఏళ్లపాటు ప్రయాణించేవారు కావాలన్నారు. మానవత్వం కోసం పరితపించే ఎవరినైనా తాను అభిమానిస్తాని చెప్పారు. అమరావతిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానని.. తన అంతిమ శ్వాస వరకు రాజకీయ పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబుతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు. గెలుపు, వ్యక్తిగత లబ్ధి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు.
సీఎం జగన్‌కు కేసుల భయం ఉంది
ఇసుక మాఫియా ఇప్పుడు కూడా జరుగుతోందని పవన్‌ విమర్శించారు. గతంలో తెదేపా నేతలు చేస్తే ఇప్పుడు వైకాపా నేతలు చేస్తున్నారని.. దీనిలో పెద్దగా తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదన్నారు.  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని పవన్‌ ప్రశ్నించారు. ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టినా వారి నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు. తమపై కేసులు ఉండేవాళ్లు సమాజంలో బలంగా మాట్లాడలేరని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడతారన్నారు. సీఎం జగన్‌ దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని..ఆయనకు సీబీఐ కేసుల భయం ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన కోడికత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. జగన్‌ బాబాయ్‌ హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు.

Comments