Skip to main content

కుప్పంలో రాజీనామా చేసి గెలవండి...చంద్రబాబుకు విజయసాయి సవాల్


 ప్రజలు తనను కలవరిస్తున్నట్లు భావిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలవాలని వైసీపీ నేత విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేశారు.నాలుగు మాసాల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదని...13 జిల్లాల్లోని 5 కోట్ల మంది జనమన్నారు. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నట్లు భావిస్తే తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు.

ఒక వ్యక్తి తన టచ్ మహిమతో దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ కోలుకోకుండా చేశారంటూ చంద్రబాబుపై విరుచుకపడ్డారు. వచ్చే జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2021 మేలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరూ ఊహించగలిగిందేనన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు బీజేపీ క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా సీఎం జగన్ పాలనపై విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన నాలుగు మాసాల్లోనే సీఎం జగన్ 80 శాతం హామీలను నెరవేర్చారని కొనియాడారు. వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది అర్చక కుటుంబాలకు సీఎం భరోసా కల్పించారని చెప్పారు.

Comments