మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ఖాళీ పాత్ర ఇచ్చి పోయారని మంత్రి నారాయణస్వామి అన్నారు. అయితే, వైసీపీ అక్షయపాత్ర కావడంతో అన్ని పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంటూ చంద్రబాబు అవాస్తవాలను మాట్లాడుతున్నారని, నిన్న మద్యం ఏరులై పారిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను చంద్రబాబు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. టీడీపీ పాలనలో పోలీస్ శాఖ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కానీ వైసీపీ పాలనలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment