గోదావరి నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఎగువన నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గంట గంటకూ నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద పెరిగినప్పుడల్లా తరచూ తమకీ సమస్య తప్పడం లేదని, వరదలో చిక్కుకున్నన్నాళ్లు ఇబ్బందులేనని గ్రామస్థులు వాపోతున్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment