ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయాలని లేఖలో కోరారు. ఉపాధి హామీ పథకాన్ని 2014-19 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు. రూ. 1,845 కోట్ల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా... దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇంకా జోడించలేదని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం నియమనిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని, నిధులను దారి మళ్లిస్తోందని తెలిపారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment