పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు. పవన్ ని కొత్త కోణంలో చూపించాలన్న తాపత్రయంతో కథలు తయారుచేసుకుంటూ వుంటారు. ఇప్పుడు కూడా అలాగే ముగ్గురు దర్శకులు ఆయన సినిమా ఛాన్స్ కోసం కథలు తయారుచేస్తున్నారు.
ఆమధ్య ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన పవన్.. ఇటీవల కాస్త విరామం తీసుకుని మళ్లీ సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముందుగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందుతోంది. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ కన్ఫర్మ్ చేశారు.
ఇక ఆ తదుపరి ఆయన నటించే 29వ సినిమా కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఆయనకు ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణ పనుల్లో వున్నారాయన. అయితే, దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, డాలీ, గోపీచంద్ మలినేని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ ని మెప్పించే కథ ఎవరు తెస్తే వారికే ఛాన్స్ ఇవ్వాలని నిర్మాత నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులూ తమతమ కథల రూపకల్పనలో పడ్డారట!
Comments
Post a Comment