Skip to main content

మాకు ఎవరైనా ఒకటే : స్పందించిన ఫేస్ బుక్



భారత్లో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రిస్తున్నాయని అమెరికా మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్  ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం రేపిందనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,  వాట్సాప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్లో పెట్టుకుని నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా దేశంలో తప్పుడు  వార్తలను, విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో, బిజేపి, ఆర్.ఎస్.ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ట్విట్టర్లో పేర్కోన్నారు. చివరకు అమెరికా మీడియా ఈ బండారాన్ని బయటపెట్టిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

విద్వేష పూరిత ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్‌బుక్‌ చెప్పాలని ఆయన అన్నారు. ఈ విషయం మీద స్పందించిన ఫేస్ బుక్ విద్వేష పూరిత ప్రసంగాలకు సంబంధించిన విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. వారు ఏ రాజకీయ పదవిలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కి చెందిన వారైనా “విద్వేష పూరిత ప్రసంగాలు” చేస్తే నిబంధనలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని”,  “ఫేస్ బుక్ ప్రకటించింది.

మేం విద్వేష పూరిత ప్రసంగాలను, హింసను ప్రేరేపించే  కధనాలను, సమాచారాన్ని నిషేధిస్తాం. ఏ రాజకీయ పదవులలో ఉన్నవారైనా, ఏ పార్టీ వారైనా మేము ఉపేక్షించం. ఈ విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. అయితే, వీటిని అడ్డుకునేందుకు ఇంకా చాలా చెయ్యాలని మాకు తెలుసు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిశీలిస్తూ, తనిఖీలు నిర్వహిస్తూ, ఈ విధానాలను చాలా చాలా ఖచ్చితంగా, అపోహలకు తావులేని రీతిలో అమలు చేస్తున్నాం. కొంత ప్రగతి కూడా సాధించాం, అని ఫేస్ బుక్ ప్రతినిధి ప్రకటన చేసింది. 

Comments