కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనుగోళ్లు, తదనుగుణంగా ధరలు తగ్గిపోయాయి. ఈ సమయంలో చేతిలో డబ్బులు ఉన్నవాళ్లు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి.
1.వడ్డీ రేటు ఎంత.. ఎవరికి వర్తిస్తుంది?
దేశంలో అతిపెద్ద మార్టగేజ్ రుణాలు అందించే LICHFL వడ్డీరేటును గతంలో ఎన్నడు లేని విధంగా 6.90 శాతానికి తగ్గిస్తున్నట్లు బుధవారం తెలిపింది. అయితే సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్నవారు కొత్తగా రూ.50 లక్షల లోపు ఇంటి రుణం తీసుకున్న వారికి మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. రూ.50 లక్షలపై రుణం తీసుకున్నవారికి మాత్రం 7శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. హోమ్ లోన్స్ పైన వడ్డీరేటు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గించడంతో నెలవారి చెల్లింపులు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో హోమ్ లోన్స్ ఊపందుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సిద్దార్థ మొహంతి తెలిపారు.
2.వరుసగా తగ్గింపు..
ఏప్రిల్ నెలలో LICHFL హోమ్ లోన్ వడ్డీ రేట్లను 7.5 శాతానికి తగ్గించింది. సిబిల్ స్కోర్ 800, అంతకు పైగా ఉన్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పుడు సిబిల్ స్కోర్‌ను 700కు పరిమితం చేయడంతో పాటు వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించడం గమనార్హం. సంస్థ కాస్ట్ అఫ్ ఫండ్ 5.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కంపెనీ రుణాల్లో 25 శాతం లోన్ మారటోరియం పరిధిలో ఉన్నట్లు సిద్ధార్థ్ తెలిపారు. రూ.13,000 కోట్ల నిర్మాణరంగ రుణాల్లో రూ.8,500 కోట్ల నుండి 9,000 కోట్లు మారటోరియం పరిధిలో ఉన్నాయన్నారు.
3.మార్కెట్లో కనిష్ట రేటు.. రుణం తీసుకున్నా తక్కువ వడ్డీ రేటుకు..
LICHFL హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును 6.9 శాతానికి తగ్గించడంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. ఈ తగ్గింపు ద్వారా ఇప్పటికే మార్కెట్లోని ఇతర రుణ సంస్థల కంటే తక్కువ వడ్డీ రేటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐలు 6.95 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇప్పుడు LICHFL అంతకంటే తక్కువకు ఇస్తోంది. ఇప్పటికే LICHFLలో రుణాలు తీసుకున్న వారు కూడా నామమాత్రపు రీరైటింగ్ ఫీజు చెల్లించడం ద్వారా తక్కువ వడ్డీ రేటుకు మారే సౌకర్యం ఉంది.
4.పెన్షనర్లకు గృహ వరిష్ట
పెన్షనర్లకు కూడా LICHFL సరికొత్త గృహ వరిష్ట పథకాన్ని తీసుకు వచ్చింది. 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా రుణం తీసుకున్న తేదీ నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, రక్షణ బ్యాంకింగ్ రంగాల్లోని రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీసుల్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఎక్కువ రుణం కావాలంటే సంపాదించే తమ పిల్లలతో కలిసి పెన్షన్‌దారులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Post a Comment