ఏపీలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా స్పందించారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయని, థర్మల్ విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో కరెంటు కోతలు తప్పడంలేదని ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "క్షమించాలి, మా పనయిపోయింది" అంటూ ఏపీ సర్కారు ప్రజలకు ఈ విధంగా చెబుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా ట్వీట్ చేశారు. 'క్షీణించిపోతున్న బొగ్గు నిల్వలు: తెలంగాణ సీఎంను సాయం కోరిన జగన్' అంటూ ప్రచురితమైన కథనాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment