రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బొగ్గు కొరత కారణంగానే విద్యుత్ ఉత్పాదన తగ్గిందని ప్రభుత్వం వివరణ ఇస్తున్నా, విమర్శల తాకిడి తప్పడంలేదు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ ను కొనుగోలు చేయవచ్చు కదా అని కూడా స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా గత 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుదుత్పత్తి సరిగా లేదని తెలిపారు. వచ్చే 7 రోజుల పాటు 8 ర్యాకుల చొప్పున బొగ్గు సింగరేణి నుంచి వస్తోందని, కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లించామని వెల్లడించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment