Skip to main content

నేటితో ఆ మద్యం బంద్: ఇక అంతా ప్రభుత్వమే: బీర్లు మాత్రం కష్టమే..!

ఏపీలో దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా కీలక నిర్ణయాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా ఇక రోజుతో ప్రైవేటు మద్యం బంద్ కానుంది. రేపటి నుండి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిం చాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే వ్యాపారం చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు షాపులను ఖాళీ చేస్తున్నారు. సరుకునంతా విక్రయించేసి షాపులను ఖాళీచేసే పనిలో ప్రైవేటు మద్యం వ్యాపారులు బిజీగా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ సంధి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరక్క.. దొరికినా ఇష్టమైన బ్రాండు లభించక మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి.. 3,448 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోంది.

ఇక ప్రైవేటు మద్యం బంద్..

ఏపీలో పదిహేనేళ్ల తరువాత పూర్తిగా ప్రైవేటు మద్యం రద్దవుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ తన నవరత్నాల్లో ప్రకటించారు. అందులో భాగంగా కీలక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం అమ్మకాలను నిలిపివేసి..ప్రభుత్వమే షాపులను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో..లైసెన్సులు అయిపోతున్నందున ప్రైవేటు వ్యాపారుల సరుకును దాదాపుగా ఇప్పటికే ఖాళీ చేశారు. ఆదివారమే అనేక షాపుల్లో మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. కేవలం షాపుల్లో మిగిలిపోయిన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. ప్రైవేటు మద్యం షాపులన్నీ ఖాళీ చేస్తున్నారు. మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌ తీసుకుని, అందుకు నగదు ఇవ్వదు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం కొరత ఏర్పడింది. అయితే ఈ ప్రభావం పడకుండా.. ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే ప్రభుత్వ షాపులకు సరుకును చేర్చింది. ఒక్కో షాపునకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల విలువైన మద్యాన్ని చేర్చింది.

ప్రభుత్వ దుకాణాలు ఎక్సైజ్ సిబ్బందికే బాధ్యతలు

షాపుల్లో సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తిచేసి, వారికి శిక్షణ ఇచ్చింది. 1వ తేదీ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని షాపులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 3,500 షాపుల్లో 3,200 వరకూ అక్టోబర్ 1వ తేదీ ప్రారంభం కావొచ్చని, మిగిలినచోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ప్రైవేటు షాపుల తరహాలోనే ప్రభుత్వ షాపుల్లోనూ అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు షాపుల్లో ఉల్లంఘనలు జరిగితే వ్యాపారులపై కేసులు పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వ షాపుల్లో ఉల్లంఘనలకు షాపు సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను బాధ్యులను చేయనున్నారు. అయితే తమపై తామే కేసులు పెట్టుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఉల్లంఘనలకు అవకాశం లేకుండా సీఐలు, ఎస్‌ఐలకు పదేసి షాపుల బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనివల్ల అవకతవకలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Comments