మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు మోదీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి వంటి నేతలతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు వాళ్ల ఊసే ఎత్తడంలేదని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వాళ్లలో ఏ ఒక్కర్నీ మళ్లీ కలిసిన పాపానపోలేదని విమర్శించారు. ఒకవేళ ఆ నేతలు ఎయిర్ పోర్టులో కనిపించినా చంద్రబాబు ముఖం తిప్పుకుని వెళ్లిపోతున్నారని, ఆయన జీవితం అంతా యూటర్న్ లేనని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మళ్లీ మోదీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారని, మోదీ గారిని వదులుకుని మనం చాలా తప్పు చేశామని వైజాగ్ లో టీడీపీ కార్యకర్తలతో చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. అమిత్ షాను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తండ్రీకొడుకులు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీలుపడ్డారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనవద్ద ఉన్నదాన్ని పుత్తడి అని, వేరే వాళ్ల వద్ద ఉంటే ఇత్తడి అని అంటారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా జుగుప్సాకరమని పేర్కొన్నారు.
Comments
Post a Comment