కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరగాల్సిన వైఎస్ జగన్ భేటీ మరోసారి రద్దయింది. జగన్ కు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా కార్యాలయం నుంచి జగన్ కు సమాచారం అందింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం అయిపోయేంత వరకూ అమిత్ షా బిజీగా ఉంటారని, ఎవరికీ విడిగా అపాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదని హోమ్ శాఖ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. కాగా, ఇటీవలి కాలంలో అమిత్, జగన్ ల భేటీ రద్దు కావడం ఇది రెండోసారి. ఇక అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నేడు ఢిల్లీకి వెళ్లి పలు అంశాలపై అమిత్ షా తో జగన్ చర్చించాల్సి వుంది. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీని కలిసిన జగన్, హోమ్ మంత్రిని మాత్రం కలవలేకపోయారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment