ఏడాదిన్నర పాప సుహానా పరిస్థితి గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసి, అధికారులను అడిగి విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడి, పాప ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగారు. సుహానా చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. చిన్నారికి రోజువారీ చికిత్సకు అవసరమయ్యే ఇన్సులిన్ ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉచితంగా అందించాలని ఆదేశించారు.
కాగా, చిత్తూరు జిల్లా బి. కొత్తకోటకు చెందిన బావాజాన్, షబానా దంపతులుకు తొలుత ఇద్దరు పిల్లలు పుట్టి, షుగర్ స్ధాయి పడిపోవడంతో చనిపోగా, గత సంవత్సరం సుహానా జన్మించింది. పాప శారీరక ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో వైద్యులకు చూపించగా, ఆమెకు కూడా షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, జన్యు పరమైన లోపాల కారణంగా ఈ వ్యాధి వచ్చిందని తేల్చారు.
బావాజాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా, సుహానా గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. తమ పాపను మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపాలని అనుకుంటున్నామని, అనుమతించాలని వారు చేసిన విన్నపం వైరల్ అయింది. దీనిపై ఎన్నో కథనాలు వచ్చాయి. వాటిని చూసిన జగన్, స్వయంగా స్పందించారు. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించడం, కలెక్టర్ ఇంటికి వచ్చి వివరాలు అడిగి, పాపకు నయం చేయిస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Comments
Post a Comment