తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్ఫి)లో ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయం తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగానికి రజనీకాంత్ అందించిన సేవలు అద్భుతమని జవదేకర్ ఓ ప్రకటనలో కొనియాడారు. అందుకే ఈ ఏడాది ఇఫ్ఫి-2019 ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును రజనీకాంత్ కు ప్రదానం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
50వ ఇఫ్ఫి అవార్డుల ఉత్సవం గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన సుమారు 250 సినిమాలను ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. ఇక, విదేశీ ఆర్టిస్ట్ కేటగిరీలో ఇఫ్ఫి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఈ ఏడాది ఫ్రెంచ్ నటీమణి ఇసబెల్లా హూపర్ట్ కు ప్రదానం చేస్తున్నట్టు జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా, ఇఫ్ఫి-2019 చలనచిత్రోత్సవాలను భారత్ తన చిరకాల మిత్రదేశం రష్యా భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.
Comments
Post a Comment