అమెరికాలోని మిస్సౌరీలో ఒక్కసారిగా వేల సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. 2100 స్పోర్ట్స్ కార్లు, 70 అత్యాధునిక బైకులు వరుసగా కొలువుదీరాయి. దీనంతటికీ కారణం తెలుసుకోవాలంటే అలెక్ ఇంగ్రామ్ అనే 14 ఏళ్ల బాలుడి కథ తెలుసుకోవాలి. అలెక్ ఇంగ్రామ్ నవంబరు 7న కన్నుమూశాడు. ఆస్టియోసర్కోమా అనే అరుదైన బోన్ క్యాన్సర్ అలెక్ ను కబళించింది. నాలుగేళ్లకు పైగా క్యాన్సర్ తో పోరాడిన ఆ మిస్సౌరీ బాలుడు కొన్నిరోజుల క్రితమే ఈ లోకాన్ని వీడాడు. అలెక్ కు స్పోర్ట్స్ కార్లంటే పిచ్చి. అందుకే తన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ కార్లు, బైకులు పాల్గొనాలన్నది చివరికోరిక అని కుటుంబ సభ్యులకు తెలిపాడు.
ఈ విషయం తెలిసిన అమెరికా సమాజం కదిలిపోయింది. ముఖ్యంగా సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ ముందుకొచ్చి స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓ కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కార్లు వాషింగ్టన్ లోని మిస్సౌరీ చేరుకున్నాయి. మిస్సౌరీ నుంచి వాషింగ్టన్ లోని ఇమ్యూనల్ లూథరన్ చర్చ్ వరకు అలెక్ కడసారి యాత్రకు తోడుగా వచ్చేందుకు స్థానిక సిక్స్ ఫ్లాగ్స్ సెయింట్ లూయిస్ పార్కింట్ ఏరియా వద్ద కొలువుదీరాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Post a Comment