అమరావతి రైతుల మానవహారం
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఆందోళన ఉద్ధృతం
చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు సీడ్ యాక్సిస్ రహదారిపై నిరసన
చేపట్టారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా
ఏర్పడ్డారు. జాతీయజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పాలన వికేంద్రీకరణ,
సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి,
మరికొందరు వేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది.
న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ నిరసన
తెలిపారు. న్యాయస్థానాలే తమను కాపాడాలని వేడుకున్నారు. మూడు రాజధానుల
నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు
నినదించారు.
ఈ
సందర్భంగా జేఏసీ కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ... ప్రజా రాజధాని
నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ క్రీడగా మార్చారని ఆవేదన
వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని రైతుల హక్కులు
కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఏక
పక్షంగా సీఆర్డీఏ బిల్లును రద్దు చేశారని ఆరోపించారు.
మరో
వైపు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలోని అన్ని
పోలీస్‌స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో నమ్మించి మోసం
చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై చేసిన ప్రకటనల
క్లిప్పింగ్‌లను ఫిర్యాదుకు జత చేశారు.
Comments
Post a Comment