Skip to main content

వైసీపీ ఎమ్మెల్సీకి చిక్కులు.. జగన్‌పై అభిమానంతో జడ్జిలపై నోరుజారినందుకు..


జడ్జిల మీద పరుష వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది హైకోర్టు సీజేకు లేఖ రాశ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కోర్టును, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొందరు ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఆక్షేపించారు. న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు ఇలా మాట్లాడటం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో న్యాయవాది లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

రవీంద్రబాబు ఏమన్నారు?

ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సందర్భంగా పండుల రవీంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన జడ్జిల మీద పరుష వ్యాఖ్యలు చేసినట్టు ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది. ‘జ్యుడీషియరీగానీ, చంద్రబాబుగానీ, జడ్జీలుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు’ అని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. రాజధాని రైతుల శాపమే చంద్రబాబును ఘోర పరాజయంపాలు చేసిందని ఆరోపించారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారంతా రైతులు కాదని, వారి ముసుగులో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులని రవీంద్రబాబు ఆరోపించారు.

Comments