ఈ-రక్షాబంధన్ ప్రారంభించడానికి ముందు ఇవాళ ఉదయం ఆసరా, చేయూత వంటి మహిళలకు సాధికారత కల్పించే కార్యక్రమాలకు ఉపయోగపడే కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గేంబుల్, అమూల్ వంటి సంస్థల సహకారంతో బ్యాంకుల ద్వారా ప్రతి ఇంట్లో ఓ మహిళకు నాలుగేళ్ల పాటు నికర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇక ఈ-రక్షాబంధన్ లోగో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ-రక్షాబంధన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణ ఎలాగన్నదానిపై నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఉంటాయని అన్నారు. అందుకోసం 4ఎస్ 4యూ అనే పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
సైబర్ నేరాలకు గురయ్యే మహిళలకు సైబర్ మిత్ర యాప్ ద్వారా, లేక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేకపోతే నిర్దేశిత టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. అంతేకాదు, ఈ-రక్షాబంధన్ కార్యక్రమంపై షార్ట్ ఫిలింలు, యానిమేషన్ కార్యక్రమాలతో మహిళల్లో ఆసక్తి, అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలకు ఇంత ప్రాముఖ్యత, గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంకేదీ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
మహిళలకు అన్నింటా 50 శాతం రిజర్వేషన్ తెస్తూ చట్టం చేశామని చెప్పారు. ఇవాళ ఆలయ కమిటీలకు, మార్కెట్ కమిటీలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారంటే అది కేవలం ఆ చట్టం వల్లనే అని సీఎం స్పష్టం చేశారు. అమ్మఒడి నుంచి ఆసరా, చేయూత వంటి పథకాలతో పాటు దేవుడు ఆశీర్వదిస్తే ఆగస్టు 15న 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.
Comments
Post a Comment