Skip to main content

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన జగన్ సర్కార్.. హర్షం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలంటూ... ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, నేడు పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు తమ సర్వీసుల్లో మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

మరోవైపు, పదవీ విరమణ వయసును పొడిగించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీలోని 52 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ఈ సందర్భంగా తెలిపారు.

Comments