జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం యాదవాడలో జరుగుతున్న యురేనియం ఖనిజం అన్వేషణ పనులను మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియ అడ్డుకున్నారు. ఆమె ఘటనాస్థలికి రావడంతో వెంటనే కాంట్రాక్ట్ సిబ్బంది పనులను ఆపేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన అఖిల.. ఏపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా యాదవాడలో యురేనియం ఖనిజాన్వేషణ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. యురేనియం కోసం సర్వే చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాగా.. వారం రోజులుగా యురేనియం ఖనిజం అన్వేషణ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని అఖిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటి నుంచి క్యాంపెయిన్!
"యురేనియం వల్ల కడప జిల్లాలో వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు.. నీరంతా కలుషితమైంది. ‘సేవ్ నల్లమల... సేవ్ ఆళ్లగడ్డ’ క్యాంపెయిన్ నేటి నుంచే మొదలైంది. గతంలో వైసీపీ నాయకులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకించారు. ఇప్పుడు మౌనంగా ఉండడం శోచనీయం.. అసలెందుకు మౌనంగా ఉంటున్నారు..?. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం ఖనిజాన్వేషణ పనులను ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలి. లేకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాను " అని ప్రభుత్వాన్ని అఖిల హెచ్చరించారు. అఖిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Comments
Post a Comment