రష్యాలో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఇటీవల కాలంలో బలమైన ప్రత్యర్థిగా ఎదిగిన అలెక్సీ నావల్నీ ప్రస్తుతం కోమాలో ఉన్నారు. 44 ఏళ్ల నావల్నీపై విషప్రయోగం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. నావల్నీ సైబీరియా నుంచి మాస్కోకి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో విమానంలో బాత్రూంకి వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయారు.
దాంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓమ్స్క్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఓమ్స్క్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నావల్నీ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కోమాలోకి వెళ్లిన నావల్నీకి ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా చికిత్స జరుగుతోంది.
దీనిపై నావల్నీ మీడియా సెక్రటరీ కిరా యార్మిష్ వివరాలు తెలిపారు. నావల్నీ ఉదయం టీ తప్ప మరేమీ తీసుకోలేదని, టీలోనే విషం కలిపివుంటారని అనుమానిస్తున్నామని తెలిపారు.
రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పక్షానికి చెందిన అలెక్సీ నావల్నీ అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో ప్రజల్లో బలమైన నేతగా గుర్తింపు వచ్చింది. ఏకంగా అధ్యక్షుడు పుతిన్ పైనే ఆరోపణలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆయనపై దాడులు కూడా జరిగాయి. గతంలోనూ ఓసారి విషప్రయోగం జరిగింది.
Comments
Post a Comment