దేశంలో నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గౌరవించేందుకు, అలాగే ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు(ఆగస్ట్ 13) కొత్త పన్ను పథక ప్లాట్‌ఫాంని ప్రారంభిస్తున్నారు. 'పారదర్శక పన్ను విధానం-నిజాయితీపరులకు గౌరవం' అనే పేరుతో ఏర్పాటయిన ఓ ప్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్నారు. ప్రధాని దీనిని ప్రారంభించడం ద్వారా దేశంలో ప్రత్యక్ష పన్ను సంస్కరణల ప్రయాణంలో మరో అడుగు ముందుకు పడుతుంది. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల గౌరవం కోసం ట్యాక్స్‌పేయర్ చార్టర్‌ను తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫాం రూపుదిద్దుకుంది.
పన్నుచెల్లింపుదారులకు మోడీ థ్యాంక్స్
పన్నుచెల్లింపుదారులకు మోడీ థ్యాంక్స్
నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములు అని, దేశాన్ని కరోనా పీడిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు ఇచ్చిన ఉచిత ఆహారధాన్యం వంటి ప్యాకేజీ పన్ను చెల్లింపుదారుల నిజాయితీతోనే సాధ్యమైందని కూడా ప్రధాని మోడీ ఇదివరకే ప్రశంసించారు. వారికి థ్యాంక్స్ చెప్పారు. ట్యాక్స్‌పేయర్ చార్టర్ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ అసోసియేషన్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్, ప్రముఖ పన్ను చెల్లింపుదారులు, ఆదాయపన్ను శాఖ అధికారులు ఉంటారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరవుతున్నారు.
త్వరితగతిన పొందేలా..
త్వరితగతిన సేవలు పొందేలా..
ట్యాక్స్ పేయర్ చార్టర్ తీసుకురానున్నట్లు కేంద్రం గత బడ్జెట్లోనే ప్రకటించింది. చట్టబద్ధ హోదాను కలిగి ఉండే ఈ ప్లాట్‌ఫాం.. ఆదాయ పన్ను (ఐటీ) విభాగం సేవలను త్వరితగతిన పొందేలా ప్రజలకు సాధికారత కల్పిస్తుంది. పన్నుల చెల్లింపులో పారదర్శకతను పెంపొందించడంతో పాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించేందుకు తీసుకొస్తున్న ఈ ప్లాట్‌ఫాం ప్రత్యక్ష పన్ను సంస్కరణల్ని మరింత ముందుకు నడిపేందుకు దోహదం చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల పలు కీలక
ఇటీవల పలు కీలక సంస్కరణలు
పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు తీసుకు వస్తోంది. గత ఏడాది కార్పోరేట్ పన్ను రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెలకొల్పేవారికి 15 శాతానికి కుదించింది. డివిడెండ్ పంపిణీ పన్నును కూడా రద్దు చేసింది. పన్ను రేట్లను తగ్గించడం, ప్రత్యక్ష పన్ను చట్టాల్ని సరళతరం చేయడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని, ఐటీ విభాగ పనితీరుని, పారదర్శకతని పెంపొందించేందుకు CBDT ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక శాఖ పేర్కొంది.
Comments
Post a Comment