Skip to main content

ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం

 
ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం

 ఆర్టీసీ సమ్మె, ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపై హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘ వాదనలు సాగాయి. ఆర్టీసీకిబకాయిలన్నీ చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది, జీహెచ్‌ఎంసీ కూడా రూ.360 కోట్లు చెల్లించామంటోంది...ఇందులో వాస్తవమెంత అని హైకోర్టు గత విచారణ సందర్భంగా ఆర్టీసీ ఎండీని నివేదిక కోరింది. హైకోర్టు ఆదేశాలమేరకు పూర్తి వివరాలతో నిన్న అఫిడవిట్‌ సమర్పించిన ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఇవాళ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. సునీల్‌శర్మ ఇచ్చిన నివేదికను పరిశీలించిన హైకోర్టుఅసహనం వ్యక్తం చేసింది.
లెక్కల్లో గందరగోళం..
‘‘కోర్టుకు సమర్పించే నివేదికలు ఇలాగేనా? ఐఏఎస్‌ అధికారులు సమర్పించిన నివేదికలు అస్పష్టంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచి నివేదికలు ఇచ్చారు. ఐఏఎస్‌ అధికారులు లెక్కలతో గందరగోళం సృష్టిస్తున్నారు. బస్సుల కొనుగోలు రుణాన్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటున్నారు’’ అని హైకోర్టు ప్రశ్నించింది. డీజిల్‌, వేతనాల చెల్లింపునకు రాయితీల బకాయిలు వాడామని ఎండీ వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ భరించాలని చట్టంలో ఎక్కడా లేదని ఆర్టీసీ ఎండీ నివేదికలో పేర్కొన్న అంశంపై కోర్టు స్పందిస్తూ... ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన అవసరమే లేనప్పుడు ఎందుకు చెల్లించారని ప్రశ్నించింది. 2015 నుంచి 2017 వరకు రూ.336కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది.
జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారా?
 2018-19 ఏడాదిలో ఆర్టీసీకి రావాల్సిన నిధుల అంశంపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారా? జీహెచ్‌ఎంసీ చెల్లించకుంటే  ప్రభుత్వానికి లేఖ రాశారా అని కోర్టు ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ 2015-16లో రూ.550 కోట్లు లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ 2015-16లో రూ.108 కోట్లు, ఆతర్వాత సంవత్సరంలో రూ.228 కోట్లు ఎలా చెల్లించింది? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నదని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని రవాణాశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘అసెంబ్లీ వేదికగా రవాణా మంత్రి తప్పు ప్రకటన చేస్తారని మేము అనుకోవడంలేదు. అసెంబ్లీలో మంత్రి చెప్పింది నమ్మాలా? మీరు కోర్టుకు చెప్పింది నమ్మలా’’ అని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆర్టీసీ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రీధరన్‌ వాదనలు వినిపించారు.

Comments