Skip to main content

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

ex mla tdp leader chintamaneni prabhakar remand extend to october 9
తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది. 
2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. 
అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు. 
ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పోలీసులపై చింతమనేని ప్రభాకర్ అనుచితంగా ప్రవర్తించారంటూ కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో అక్టోబర్ 1 వరకు కోర్టు రిమాండ్ విధించింది. 

Comments