Skip to main content

పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్రం తీపికబురు–

 


అంతర్రాష్ట్ర రవాణా విషయంలో ఎలాంటి కండిషన్లు పెట్టొద్దని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశించారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్పష్టం చేశారు. ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని స్పష్టం చేశారు. అన్ లాక్ 3లో భాగంగా కేంద్ర హోంశాఖ జూలై 27న రాష్ట్రాలకు పలు నిబంధనలను సూచించింది. అందులోని పేరా 5లో అంతర్రాష్ట్ర రవాణా మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రజలుకానీ, వాహనాలు కానీ వెళ్తే వారికి లేదా వాటికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ప్రత్యేక పర్మిషన్లు, అనుమతులు, ఈ-పాస్‌లు కూడా అవసరం లేదు. పొరుగుదేశాల నుంచి వచ్చే వాహనాల విషయంలో కూడా ఎలాంటి కొత్త నిబంధనలు లేవు.

స్థానికంగా కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కొన్ని కండిషన్లు పెడుతున్నట్టు కేంద్రం దృష్టికి వచ్చిందని అజయ్ భల్లా అన్నారు. అలాంటి షరతులు పెట్టడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రవాణా విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, సప్లై చైన్ దెబ్బతింటుందన్నారు. దాని వల్ల ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇలాంటి షరతులు విధించడం అంటే కేంద్ర హోంశాఖ జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించడమేనని అజయ్ భల్లా స్పష్టం చేశారు. కాబట్టి, ఇకపై అలాంటి షరతులు విధించవద్దని రాష్ట్రాలు, జిల్లాల అధికారులకు అజయ్ భల్లా స్పష్టం చేశారు.

            

Comments